Indian Home Services Market 2026 : 10 నిమిషాల్లో ‘పనిమనిషి’… బీభత్సంగా దూసుకెళ్తున్న యాప్.. ఆల్రెడీ 1 కోటి డౌన్ లోడ్స్..
Indian Home Services Market 2026 : దేశంలో పది నిమిషాల్లో పని మనిషుల సర్వీస్ కి డిమాండ్ బాగా పెరుగుతోంది.
instant home services apps cross 10 million monthly users in india
- ఇండియాలో డొమెస్టిక్ హెల్ప్ యాప్స్ కి పెరుగుతున్న డిమాండ్
- ఒక్క మార్చి నెలలోనే 1 కోటి డౌన్ లోడ్స్
- ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న అర్బన్ కంపెనీ
Indian Home Services Market 2026 : అత్యాధునిక సాంకేతికత అన్ని రంగాల స్వరూపాలను మార్చేస్తోంది. ఒకప్పుడు సరుకులు, కూరగాయలు కొనాలంటే మార్కెట్ లేదా సంతకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేడు ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో వస్తువులు ఇంటికి వచ్చేస్తున్నాయి. ఈ సేవలు ఆఖరికి పని మనుషులను కూడా ‘డెలివరీ’ చేస్తున్నాయి. యాప్ ఓపెన్ చేసి మనకు ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజుల లెక్కన పని వాళ్లు కావాలో ఆర్డర్ చేస్తే.. వారు నేరుగా ఇంటికే వచ్చి పనులు చేసి వెళ్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ రిపేర్ వంటి పనులకు కూడా ఇలాంటి ఆన్లైన్ సేవలే లభిస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. భారతదేశంలో ‘ఇన్స్టంట్ హోమ్ సర్వీసెస్’ (తక్షణ గృహ సేవలు) వినియోగదారులు 10 మిలియన్లు (1 కోటి) దాటారని తెలిపింది.
నగరాల్లో పెరుగుతున్న ఆదరణ
ముఖ్యంగా నగర ప్రాంతాల్లో యాప్ ఆధారిత గృహ సహాయ సేవలకు (Domestic Help) ఆదరణ విపరీతంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నెల గణాంకాల ప్రకారం, ఈ విభాగంలో నెలవారీ యాక్టివ్ వినియోగదారుల (MAUs) సంఖ్య 10.4 మిలియన్ల మార్కును దాటింది.
మోర్గాన్ స్టాన్లీ పరిశోధన నివేదిక ప్రకారం, ఈ రంగంలో ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగదారుల వివరాలు ఇలా ఉన్నాయి:
- అర్బన్ కంపెనీ (Urban Company): 6.5 మిలియన్ల వినియోగదారులు (అగ్రస్థానంలో ఉంది).
- ప్రాంటో (Pronto): 2.7 మిలియన్ల వినియోగదారులు.
- స్నాబిట్ (Snabbit): 1.2 మిలియన్ల వినియోగదారులు.
పోటీలో నిలుస్తున్న కొత్త స్టార్టప్‌లు
ఈ రంగంలో అర్బన్ కంపెనీ అతిపెద్ద ప్లేయర్‌గా కొనసాగుతున్నప్పటికీ, కొత్త స్టార్టప్‌లు వేగంగా పుంజుకుంటున్నాయి. మార్చి నెలలో జరిగిన యాప్ డౌన్లోడ్లలో ప్రాంటో 43 శాతం వాటాతో ముందంజలో ఉంది. క్లీనింగ్, పాత్రలు కడగడం (Dishwashing), లాండ్రీ, వంట వంటి సేవల కోసం వినియోగదారులు ఈ యాప్‌లను ఎక్కువగా వాడుతున్నారు.
భారీగా పెరుగుతున్న బుకింగ్‌లు
- వినియోగదారులతో పాటు లావాదేవీల సంఖ్య కూడా భారీగా పెరిగింది:
- అర్బన్ కంపెనీ ‘ఇన్‌స్టాహెల్ప్’ నెలకు 10 లక్షల బుకింగ్‌లను దాటింది.
- ప్రాంటో రోజుకు సుమారు 18,000 బుకింగ్‌లను చేస్తోంది.
- స్నాబిట్ కూడా నెలకు దాదాపు 10 లక్షల బుకింగ్‌లకు చేరువలో ఉంది.
పెట్టుబడుల వెల్లువ
- ఈ రంగంలోని వృద్ధిని చూసి ఇన్వెస్టర్లు భారీగా నిధులు సమకూరుస్తున్నారు:
- ప్రాంటో: సుమారు 200 మిలియన్ డాలర్ల విలువతో 15–20 మిలియన్ డాలర్ల నిధుల సేకరణలో ఉంది.
- స్నాబిట్: 350–400 మిలియన్ డాలర్ల విలువతో 60–70 మిలియన్ డాలర్ల నిధుల కోసం చర్చలు జరుపుతోంది.
