Diesel Shortage: డీజిల్ వినియోగదారులకు షాక్.. విక్రయాలపై మళ్ళీ కేంద్రం ఆంక్షలు.. రోజుకి ఎన్ని లీటర్లో తెలుసా?
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా రిటైల్ డీజిల్ (Diesel Shortage)ధరలు రూ.40 వ్యత్యాసం ఏర్పడింది.
Jio bp nayara energy limit diesel sales as bulk retail price gap widens
Diesel Shortage: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా రిటైల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉండటంతో ఇంధన మార్కెట్లో కొత్త సంక్షోభం నెలకొంది. బల్క్ డీజిల్ ధరలకు, సాధారణ పెట్రోల్ బంకుల్లో లభించే రిటైల్ ధరలకు మధ్య లీటరుకు ఏకంగా రూ.40 వ్యత్యాసం ఏర్పడింది. దీంతో ఫ్యాక్టరీలు, ఆసుపత్రులు, హోటళ్లు, మాల్స్, టెలికాం కంపెనీలు నేరుగా కంపెనీల నుంచి బల్క్ డీజిల్ కొనడం మానేసి, చౌకగా లభించే రిటైల్ పెట్రోల్ బంకుల నుంచే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. ఈ భారీ డిమాండ్ వల్ల బంకుల్లో ఇంధన నిల్వలు వేగంగా ఖాళీ అవుతూ నెట్వర్క్పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.
జియో–బీపీ, నయారా కీలక నిర్ణయం – వినియోగదారులకు కొత్త రూల్స్:
బంకుల్లో నిల్వలు హఠాత్తుగా తగ్గిపోతుండటంతో సాధారణ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రైవేట్ ఇంధన సంస్థలైన జియో–బీపీ, నయారా ఎనర్జీలు డీజిల్ విక్రయాలపై గరిష్ట పరిమితులు విధించాయి. జియో–బీపీ తమ అవుట్లెట్లలో(Diesel Shortage) ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 50 లీటర్లు మాత్రమే విక్రయిస్తుండగా, నయారా 70 నుంచి 200 లీటర్ల పరిమితిని అమలు చేస్తోంది. దేశంలో మెజారిటీ పెట్రోల్ పంపులు కలిగి ఉన్న ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా త్వరలోనే ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లీటరుకు రూ.40 వ్యత్యాసమే ప్రధాన కారణం – నిపుణుల విశ్లేషణ:
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 108 డాలర్లకు చేరినా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం రిటైల్ ధరలను పెంచలేదు. అయితే పరిశ్రమలు వాడే బల్క్ డీజిల్ ధరలు మాత్రం మార్కెట్ శైలికి అనుగుణంగా పెరగడంతో ఇరు ధరల మధ్య భారీ తేడా వచ్చింది. పారిశ్రామిక వినియోగదారులు సాధారణ బంకుల నుంచి ఒకేసారి 400 నుంచి 600 లీటర్లు కొనుగోలు చేస్తుండటంతో సరఫరా వ్యవస్థ తలకిందులైంది. బల్క్, రిటైల్ ధరల మధ్య సమతుల్యత సాధించకపోతే పెట్రోల్ బంకులపై ఈ సరఫరా ఒత్తిడి మరిన్ని రోజులు కొనసాగే ప్రమాదముంది.
