My Home Group: మై హోమ్ గ్రూప్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు
కేటీఆర్ చేతుల మీదుగా మై హోమ్ గ్రూప్ టెక్నికల్ డైరెక్టర్ నారంగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అవార్డు అందుకున్నారు.

My Home Group
My Home Group – Award: మై హోమ్ గ్రూప్ మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేటగిరీలో మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (My Home Industries Pvt Ltd) ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్ అందుకుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఇవాళ తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండలి సమాఖ్య (FTCCI) ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం జరిగింది. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అవార్డును ప్రదానం చేశారు.
కేటీఆర్ చేతుల మీదుగా మై హోమ్ గ్రూప్ టెక్నికల్ డైరెక్టర్ నారంగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వీఎస్ నారంగ్, లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ… సీఎస్సార్ కింద నిధులు ఖర్చు పెట్టాలన్న ప్రభుత్వ నిబంధన కంటే ముందు నుంచే మై హోమ్ గ్రూప్ సామాజిక బాధ్యతలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
సంవత్సరానికి రూ.30 కోట్లు సీఎస్సార్ ఫండ్ ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మై హోమ్ గ్రూప్స్ ఛైర్మన్ డాక్టర్ రామేశ్వరరావు దిశానిర్దేశంలో మై హోమ్ గ్రూప్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అవార్డు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో సీఎస్సార్ ఫండ్స్ ఖర్చుచేస్తున్నామని తెలిపారు. ఈ అవార్డు తమ భాధ్యతను మరింత పెంచిందని చెప్పారు.
సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తితో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థల్లో మై హోమ్ ఒకటిగా ఉంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో ఎప్పుడూ ముందుంటుంది మై హోమ్ గ్రూప్.
మై హోమ్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. పర్యావరణహిత గ్రీన్ సిమెంట్ ఉత్పత్తులను అందించడంతో పాటు ఐజీబీసీ గోల్డ్ అండ్ ప్లాటినం రేటెడ్ గ్రీన్ నివాస, వాణిజ్య ప్రాజెక్టులను నిర్మిస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతల రూపంలో సమాజ శ్రేయస్సు విషయంలో నిబద్ధతతో ముందుకెళుతోంది మై హోమ్.
ఇందులో భాగంగా వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు, మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలలు, గ్రామాల్లో తాగునీటిని అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యానికి తోడ్పాటునందిస్తోంది. సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించడం ద్వారా ఇన్‌ఫ్రా నిర్మాణానికి సహకారం అందిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు విరాళాలు అందించడం ద్వారా విపత్తు నిర్వహణ, బాధితులకు సాయం చేయడం వంటి సేవాకార్యక్రమాలకు తోడ్పడుతోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం ద్వారా వారి నైపుణ్యాభివృద్ధి, విద్యకు సహకారం అందిస్తోంది. నిరుద్యోగ విద్యావంతులైన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటు, నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు అందించడం వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది.