ఇది లాక్‌డౌన్ కాదు…. స్లోడౌన్

ఇండియన్ ఎకానమి జనవరి-మార్చి 2019-20 క్వార్టర్ లో 3.1% మేర వృద్ధిరేటును నమోదుచేసింది. రెండేళ్లలో ఇదే తక్కువ రేటు. మార్చి క్వార్టర్ లో చివరి వారంలోనే లాక్ డౌన్ ను ప్రకటించారు. అయినా కూడా వృద్ధిరేటు నత్తనడక నడవడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇక మొత్తం 2019-20 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ పెరుగుదల రేటు 4.2% అంతకుముందు యేడాది చాలా నయం 6.1% .ముందు వేసిన అంచనాలను అందుకోవడం ఆర్ధికవ్యవస్థ కొన్నేళ్లుగా విఫలవుతోంది. మూడు త్రైమాసికాల పరిస్థితి అంతే. మొదటిలో 5.6శాతమని అనుకున్నారు. 5.2%దగ్గరే ఆగిపోయింది. జులై-సెప్టెంబర్ రెండో క్వార్టర్ లోనూ ఇదే పరిస్థితి. 5.1శాతమనుకొంటే 4.4% దగ్గరే ఆగిపొయింది. మూడో క్వార్టర్ పరిస్థితి మరింత తగ్గింది. కనీసం 4.7శాతమైన రేటు కనిపిస్తుందని మోడీ ఆశపడినా అదికాస్తా 4.1%దగ్గరే ఆగిపోయింది. నిరాశపెట్టింది.
మోడీకున్న పెద్ద ఆందోళన అంతా తయారీ, ఉత్పత్తి రంగమే. ఈ రంగం 1.4శాతానికి కుదించుకుపోయింది. నెలలు గడుస్తున్నకొద్ది తయారీ రంగం నీరసించిపోతోంది.
ఎన్నో ఆశలుపెట్టుకున్న నిర్మాణరంగమూ అంతే. కిందటి యేడాది 6 శాతంమేర ఎదిగింది. ఈయేడూ మెరుపులు కనిపిస్తాయనుకొంటే… డిమాండ్ తగ్గి.. 2.2శాతానికి పరిమితమైంది. GDPలో 55% ఉన్న services sectorకూడా గట్టి దెబ్బతింది. కాకపోతే, వ్యవసాయం కాస్త ఆదుకుంది. ప్రభుత్వం కూడా ఖర్చును పెంచడంతో ఆమేరకు కొన్నిరంగాలు లాభపడ్డాయి.
సమస్య ఎక్కడుందంటే?:
దేశ ద్రవ్యలోటు జీడీపీలో 4.6శాతానికి చేరింది. ప్రభుత్వాల ఆదాయం తగ్గడంతో ఆ మేరకు లోటుపెరిగింది. అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నట్లు. 3.8%శాతానికి లోటుమించడదని ఆర్ధికమంత్రి ఘనంగా చెప్పుకున్నారుకాని, లోటు పెరిగి టెన్షన్ పెట్టిస్తోంది. కేంద్రం కనీసం 19.31లక్షల కోట్ల మేర ఆదాయాన్ని సంపాదిస్తామని అంచానా వేసింది. వచ్చింది మాత్రం రూ 17.5 లక్షల కోట్లే. ప్రభుత్వం రూ 26.98 లక్షల కోట్లు ఖర్చుచేయాలనుకుంది. రూ.26.86 లక్షల కోట్ల దగ్గరే ఆగిపోయింది.
శుక్రవారం బైటకొచ్చిన జీడీపీ అంకెలను చూస్తుంటే… ఆర్ధికవ్యవస్థ పరుగులాపేసింది….అక్కడే కూలబడిందని అర్ధమైపోతోంది. లాక్‌డౌన్ ప్రభావం ఎంతుందో ఈ క్వార్టర్ లోనే తెలిసిపోతుంది. ఆర్దికవేత్తల అంచనా ప్రకారం…నాలుగు దశాబ్ధాల కాలంలోనే అతితక్కువ వృద్ధిరేటు నమోదుకావచ్చు. అంటే భయపడాల్సిందే.
Read: కరోనా దెబ్బ, 15వేల మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కార్ల కంపెనీ