Ratan Tata : రతన్ టాటాకు పేటీఎం సీఈఓ నివాళులు.. ఆ పోస్టుపై విమర్శలు.. డిలీట్ చేసినా ఆగని వైనం..!

Paytm CEO Vijay Shekhar Sharma : పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ రతన్ టాటా మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టాటాకు నివాళలర్పిస్తూ ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు వివాదాస్పదమైంది.

Ratan Tata : రతన్ టాటాకు పేటీఎం సీఈఓ నివాళులు.. ఆ పోస్టుపై విమర్శలు.. డిలీట్ చేసినా ఆగని వైనం..!

Paytm's Vijay Shekhar Sharma Deletes Post On Ratan Tata After Internet Calls It Disrespectful ( Image Source : Google )

Updated On : October 11, 2024 / 5:37 PM IST

Paytm CEO Vijay Shekhar Sharma – Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాదిగా పేరొందిన రతన్ టాటా మృతి పట్ల దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ దిగ్గజాలందరూ రతన్ టాటాతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పోస్టులు పెట్టారు. ముఖ్యంగా భారతీయ పరిశ్రమలో చాలామంది పెద్ద పారిశ్రామికవేత్తలు రతన్ టాటా చేసిన కృషిని కొనియాడారు. ఎంతోమందిని ప్రేరేపించిన టాటా భారతీయ వ్యాపార ప్రపంచంలో ఎనలేని కీర్తిని సంపాదించారంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు.

Read Also : Ratan Tata Funeral : ఇండస్ట్రీ లెజెండ్‌కు భారత్ వీడ్కోలు.. అధికార లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు!

వారిలో ఓలాకు చెందిన భవేష్ అగర్వాల్, పీపుల్ గ్రూప్‌కు చెందిన అనూప్ మెహతా, షావోమీ మాజీ అధినేత మను కుమార్ జైన్, భారత్‌పే మాజీ సీఈఓ అక్షర్ గోబర్ వంటి పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరంతా రతన్ టాటాను స్మరించుకుని కొనియాడుతున్నారు. రతన్ టాటా చాలా మంచి వ్యాపారవేత్త అని, భారత పరిశ్రమను ముందుకు తీసుకెళ్లారని భవేష్ అగర్వాల్ అన్నారు. రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదని, భారతకు గొప్ప ఆశాకిరణమని అనుపమ్ మెహతా అన్నారు.

తాజాగా పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కూడా రతన్ టాటా మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టాటాకు నివాళలర్పిస్తూ ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు వివాదాస్పదమైంది. పేటీఎం సీఈఓ పోస్టు చూసిన నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో వెంటనే విజయ్ శేఖర్ శర్మ ఆ పోస్టును తన అకౌంట్ నుంచి డిలీట్ చేశారు.

ఇంతకీ పేటీఎం సీఈఓ తన పోస్టులో ఏమన్నారంటే.. ‘‘రతన్‌ టాటా.. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్‌. దేశంలో అత్యంత వినయపూర్వకమైన వ్యాపారవేత్తతో సంభాషించే గొప్ప అవకాశాన్ని తర్వాతి తరాలు కోల్పోయాయి. సెల్యూట్‌ సర్‌. ఓకే.. టాటా.. బై.. బై’’ అంటూ విజయ్‌ శేఖర్‌ శర్మ పేర్కొన్నారు. తన పోస్టులో చివరి లైనులో ఆయన టాటా.. బైబై అనడం వివాదాస్పదమైంది. ఒక వ్యాపార దిగ్గజాన్ని ఇలా వ్యంగ్యంగా టాటాను అగౌరపర్చేలా ప్రస్తావించడం సరైనది కాదంటూ ఆన్‌లైన్ వేదికగా విమర్శలు వచ్చాయి.

శర్మ డిలీట్ చేసిన పోస్టుపై నెటిజన్లు ప్రతిస్పందిస్తున్నారు. “రతన్ టాటాను @vijayshekhar అపహాస్యం చేయవలసిన అవసరం లేదు”. “చివరిలో ఆ పదం సరికాదు… మేం ఒక ఇన్‌క్రెడిబుల్ పర్సన్ రతన్ సర్‌ను కోల్పోయాం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది” అని యూజర్లు వ్యాఖ్యానించారు.

“కింది లైన్ ఇలా రాయకూడదు. నాకు నచ్చలేదు” అని మూడో యూజర్ కామెంట్ చేశారు. “ఉద్దేశ్యం తప్పు కాదు.. కానీ, సమయం తప్పు. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిన టాటా సర్ లాంటి లెజెండ్, పెద్దమనిషి కోసం మన దేశంలో ఎవరూ ఇలాంటి పోస్ట్‌ను సహించరు” అని మరో యూజర్ పేర్కొన్నారు.

ఇంతలో, అసలు పోస్ట్‌ను డిలీట్ చేసిన తర్వాత, పేటీఎం శర్మ తాను మరో ప్రకటన చేశారు. “నాకు రతన్ టాటా అంటే ఎంతో అపారమైన గౌరవం. భారత అత్యంత వినయపూర్వకమైన వ్యాపారవేత్త. భవిష్యత్ తరాల వ్యాపారవేత్తలకు ఆయనే ఆదర్శం. నమస్కారాలు సార్. మీరు మా హృదయాలలో ఎప్పటికీ జీవిస్తారు” అని శర్మ ట్వీట్ చేశారు.

రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో 86ఏళ్ల వయస్సులో మరణించారు. ఆయన మరణం భారతీయ వ్యాపార రంగంలో ఒక శకానికి ముగింపు పలికింది. తన కుటుంబ యాజమాన్యంలోని సమ్మేళనాన్ని ప్రపంచ పవర్‌హౌస్‌గా మార్చాడు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపం వెల్లివిరిసి నివాళులు అర్పించారు. టాటా దూరదృష్టి గల వ్యాపారవేత్తని, దయగల వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. వ్యాపార ప్రముఖులు గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, సుందర్ పిచాయ్ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు.

Read Also : Noel Tata: టాటా ట్ర‌స్టుల చైర్మ‌న్‌గా నోయ‌ల్ టాటా.. ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న బోర్డు స‌భ్యులు