RBI New 50 Note : కొత్త రూ.50 నోట్లు వస్తున్నాయి.. అతి త్వరలోనే మార్కెట్లోకి.. పాత నోట్ల సంగతేంటి?
RBI New 50 Note : కొత్తగా విడుదల చేయబోయే రూ. 50 కరెన్సీ నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేర్కొంది. పాత రూ. 50 నోట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.

RBI New Rs 50 Note to Be Released
RBI New 50 Note : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూ. 50 కరెన్సీ నోటును విడుదల చేయనుంది. కొత్తగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. డిసెంబర్ 2024లో శక్తికాంత దాస్ స్థానంలో మల్హోత్రా పదవిని చేపట్టిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
ఈ ప్రకటనను ఆర్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో ధృవీకరించింది. కొత్తగా విడుదల చేయబోయే రూ. 50 కరెన్సీ నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని పేర్కొంది. గతంలో మార్కెట్లోకి విడుదల చేసిన పాత రూ. 50 నోట్ల రూపకల్పనకు అనుగుణంగా ఈ నోట్లలో మహాత్మా గాంధీ చిత్రపటం కొనసాగుతుంది. గతంలో జారీ చేసిన అన్ని రూ. 50 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
సంజయ్ మల్హోత్రా ఎవరంటే? :
శక్తికాంత దాస్ 6 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో కొత్త ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులయ్యారు. దీనికి ముందు, మల్హోత్రా ఆర్థిక సేవల శాఖ (DFS) కార్యదర్శిగా పనిచేశారు. 1990 రాజస్థాన్ కేడర్‌కు చెందిన సీనియర్ అధికారి అయిన మల్హోత్రా, నవంబర్ 2020లో (REC) లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. విద్యుత్ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు.
56 ఏళ్ల మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం 2022లో ఆర్‌బీఐ గవర్నర్ పదవికి నామినేట్ చేసింది. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన మూడేళ్ల పదవీకాలానికి నియామకం దేశ ద్రవ్య విధానంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన తొలి సమావేశంలోనే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దాంతో రేపో రేటు కాస్తా 6.5శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. 12వ విధాన సమీక్ష తర్వాత ఇది మొదటి రెపో రేటు తగ్గింపుగా చెప్పవచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంకుకు భారీ ఊరట.. :
మరోవైపు.. ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంకుకు కూడా భారీ ఊరట కలిగింది. 2024 ఏప్రిల్ (9 నెలల క్రితం) నెలలో ఈ కోటక్ మహీంద్రా బ్యాంకుపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేస్తున్నట్టుగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది.
గతంలో బ్యాంకులో లోపాలను గుర్తించిన తర్వాత పలు చర్యలను చేపట్టిన నేపథ్యంలోనే ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయాన్ని వెల్లడించింది. తద్వారా కోటక్ బ్యాంకు ఇకపై ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారి కొత్త వినియోగదారులను చేర్చుకునేందుకు వీలు కల్పించనుంది. అంతేకాదు.. కొత్త క్రెడిట్ కార్డులను కూడా జారీ చేసేందుకు ఆర్బీఐ ఈ కోటక్ మహీంద్రా బ్యాంకుకు అనుమతిని ఇచ్చింది.