Sugar Shortage: పండగల వేళ చక్కెర కొరత.. కొనుగోళ్లపై పరిమితులు.. ఒక్కొక్కరికి ఎన్ని కేజీలో తెలుసా?
ప్రస్తుతం క్విక్ కామర్స్ యాప్‌లైన బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్‌లలో ఒక్కో ఆర్డర్‌కు కేవలం 2 కేజీల చక్కెర(Sugar Shortage)ను మాత్రమే విక్రయిస్తున్నారు.
Sugar shortage in india festive season price hike and purchase limits
- పండగల వేళ చక్కెర కొరత
- రెండు కేజీల వరకే విక్రయాలు
- కేంద్రం భారీ చక్కెర దిగుమతులు
Sugar Shortage: పండగల సీజన్ వస్తోందంటే చాలు ప్రతీ ఇంట్లోనూ పిండివంటల సందడి, తీపి నోళ్లు పలకరించుకోవడం సాధారణంగా జరిగే ముచ్చట. అయితే ఈసారి ఆ పండగ తీపికి ధరల సెగ గట్టిగానే తగిలేలా కనిపిస్తోంది. దేశంలో చక్కెర ధరలు వేగంగా పెరుగుతుండటంతో సామాన్య గృహిణుల నుంచి మిఠాయిల తయారీదారుల వరకు అందరిలోనూ తీవ్ర ఆందోళన మొదలైంది. ఒకవైపు పెరుగుతున్న ధరలతో జేబులు ఖాళీ అవుతుంటే, మరోవైపు మార్కెట్లో కావాల్సినంత సరుకు దొరకక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో చక్కెరపై కోతలు:
ప్రస్తుతం క్విక్ కామర్స్ యాప్‌లైన బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్‌లలో ఒక్కో ఆర్డర్‌కు కేవలం 2 కేజీల చక్కెర(Sugar Shortage)ను మాత్రమే విక్రయిస్తున్నారు. డి-మార్ట్, రిలయన్స్ వంటి బడా ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ 2 నుంచి 3 కేజీలకు మించి ఇవ్వడం లేదు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా, హోల్‌సేల్ నిల్వలను అరికట్టడానికే రిటైలర్లు ఈ పరిమితులు విధించారు. పండగల కోసం ఎక్కువ మొత్తంలో పిండివంటలు చేసుకునే కుటుంబాలకు, స్వీట్ షాపులకు ఈ కోతలు పెద్ద దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
కేంద్రం కీలక నిర్ణయం – 10 లక్షల టన్నుల దిగుమతులు:
ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పండగల వేళ సుమారు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను (రా-షుగర్) సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. వీటిని రిఫైన్ చేసి మార్కెట్లోకి విడుదల చేయడానికి వ్యాపారులకు రెండు నెలల సమయం ఇచ్చింది. ఈ సరుకు మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంత త్వరగా క్షేత్రస్థాయిలో ధరలను తగ్గిస్తాయో వేచి చూడాలి.
