Gold: బంగారం ధర ఒక్కరోజే రూ.6,250పైకి.. కారణం ఇదే..! భవిష్యత్ లో గోల్డ్ రేటు ఎలా ఉండబోతుంది..?
దేశంలో గోల్డ్ రేటు రికార్డు స్థాయిలను నమోదు చేసింది. గతంలో ఎప్పుడూలేని విధంగా 10గ్రాముల గోల్డ్ రేటు ..

Gold
Gold: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గోల్డ్ రేటు రికార్డు స్థాయిలను నమోదు చేసింది. గతంలో ఎప్పుడూలేని విధంగా 10గ్రాముల గోల్డ్ రేటు రూ.96వేలు దాటేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.6,250 పెరిగి రూ.96,450కి చేరింది. మరోవైపు హైదరాబాద్ లో 10గ్రాముల గోల్డ్ రేటు రూ.95,400 పలుకుతోంది. మరోవైపు ఎంసీఎక్స్ లో బంగారం ఫ్యూచర్స్ (జూన్ డెలివరీ) 10గ్రాములకు రూ.1,703 పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.93,736 లెవెల్ ను టచ్ చేశాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో వెండి రేటు రూ.1,08,000కు చేరింది.
బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణంగా తెలుస్తోంది. ట్రంప్ దెబ్బకు ఒకవైపు స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండగా.. మరోవైపు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. యూఎస్ ప్రభుత్వం గురువారం చైనాపై టారిఫ్ ను 145శాతానికి పెంచింది. దీంతో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ ముదిరింది. దీంతో ఇన్వెస్టర్లు సేఫ్ అయిన గోల్డ్ వైపు క్యూ కడుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. రూపాయి బలంగా ఉన్నప్పటికీ.. జియో పొలిటికల్ టెన్షన్లు ముదరడం, అమెరికా – చైనా మధ్య టారిఫ్ వార్ మరింత తీవ్రతరం కావడంతో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.
టారిఫ్ వార్ ముదరడం, యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందనే భయాలు పెరగడంతో యూఎస్ డాలర్ విలువ కూడా పడిపోతుంది. బంగారం ధరలు పెరగడానికి ఇదొక కారణంగా ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలోపు 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ. లక్ష మార్క్ ను కూడా టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వివిధ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ కొనుగోళ్లు పెంచడంతో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.