Sustainable Real Estate: సస్టైనబుల్ హౌజ్ ట్రెండ్.. హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల్లో భారీగా సస్టైనబుల్ హౌజెస్ ప్రాజెక్స్ట్

హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా మంది సస్టైనబుల్ హౌజెస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఫామ్ హౌజ్‌లను కొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Sustainable Real Estate: సస్టైనబుల్ హౌజ్ ట్రెండ్.. హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల్లో భారీగా సస్టైనబుల్ హౌజెస్ ప్రాజెక్స్ట్

Sustainable Real Estate in Hyderabad

Updated On : July 17, 2023 / 2:14 PM IST

Sustainable Real Estate – Hyderabad: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. బడ్జెట్‌కు అనుగుణంగా హైదరాబాద్‌ లాంటి సిటీలో ఎక్కడో ఓ చోట సొంతంగా ఇల్లు (Own House) కట్టుకోవాలని లేదంటే కొనుక్కోవాలని అనుకుంటారు. ఇప్పుడంతా హైరైజ్ అపార్ట్‌మెంట్ (high rise apartments) ట్రెండ్ నడుస్తోంది కాబట్టి చాలా మంది ఫ్లాట్ కొనుక్కోవడానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. మరి కొంత బడ్జెట్ ఎక్కువగా ఉంటే పాష్ ఏరియాలో విల్లా కొనేందుకు ఇంకొంత మంది ఇష్టపడుతున్నారు. అయితే అపార్ట్ మెంట్, విల్లా కల్చర్ (Villa Culture) తరువాత ఇప్పుడు సస్టైనబుల్ హౌజ్ ట్రెండ్ మొదలైంది. మనం ఫామ్ హౌజ్ లేదంటే సెంకడ్ హోమ్‌గా పిలుస్తున్న సస్టైనబుల్ హౌజెస్‌కు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో డెవలపర్స్ సస్టైనబుల్ హౌజెస్ వెంచర్స్‌పై దృష్టి సారించారు. హైదరాబాద్‌లో శివారు ప్రాంతాల్లో సస్టైనబుల్ హౌజెస్ ప్రాజెక్స్ట్ భారీగా వెలుస్తున్నాయి.

నగరంలో సొంత ఇల్లు ఉన్నా కూడా ఈ బిజీ లైఫ్‌లో కాస్త రిలీఫ్ కోరుకుంటున్నారు చాలా మంది. అందులోనూ సెలబ్రిటీలు, బిజినెస్ పీపుల్ తదితరులు సిటీకి కాస్త దూరంగా ప్రశాంత వాతావరణంలో గడపాలని కోరుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగానే డెవలపర్స్ నగర శివారులో 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో సుమారు గంట నుంచి గంటన్నరలోనే చేరుకునే ప్రాంతాల్లో సస్టైనబుల్ హౌజ్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. సిటీకి కాస్త దగ్గరగా అంటే 30 నుంచి 45 నిమిషాల్లో చేరుకునేలా ఉంటే అక్కడే నివసించేందుకు సిద్ధపడుతున్నారు చాలా మంది. కాస్త దూరమైతే మాత్రం వారాంతాల్లో, లేదంటే సమయం చిక్కినప్పుడల్లా సస్టైనబుల్ హౌజెస్‌లో సేదతీరేందుకు ఇష్టపడుతున్నారు.

హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా మంది సస్టైనబుల్ హౌజెస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఫామ్ హౌజ్‌లను కొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవలే బాలీవుడ్‌‌ సూపర్‌ స్టార్‌ షారూక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్ (Suhana Khan) ముంబలై శివార్లలోని అలీబాగ్‌లో ఫామ్ హౌజ్‌ను కొనుగోలుచేసింది. ఇలా సెలబ్రెటీలు, బిజినెస్ పీపులే కాకుండా చాలా మంది తమ తమ బడ్జెట్‌కు అనుగుణంగా సస్టైనబుల్ హౌజెస్‌ను కొంటున్నారు. హైదరాబాద్ శివారుల్లో మొయినాబాద్, చేవెళ్ల, భునగరి, తుక్కుగూడ, కందుకూర్, షాద్ నగర్, జడ్చర్ల, సంగారెడ్డి, సదాశివపేట్, భువనగరి, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సస్టైనబుల్ హౌజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి.

Also Read: మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

గతంలో సింగిల్‌గా ఫామ్ హౌజ్ కొనుక్కుంటే సౌకర్యాలతో పాటు సెక్యూరిటీ సమస్య ఉంటుంది. అందుకే ఇప్పుడు సస్టైనబుల్ హౌజ్ ప్రాజెక్టులను కమ్యూనిటీ కమ్ గేటెడ్ ప్రాజెక్టులుగా ప్లాన్ చేస్తున్నారు. హైరైజ్ అపార్ట్ మెంట్స్, గేటెడ్ కమ్యునిటీలు, విల్లా ప్రాజెక్టుల్లో ఉండే సకల సౌకర్యాలను సస్టైనబుల్ హౌజ్ ప్రాజెక్టుల్లో కల్పిస్తున్నారు. క్లబ్ హౌజ్ నుంచి మొదలు స్విమ్మింగ్ పూల్ వరకు పచ్చని ప్రకృతి మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. మరి సిటీలో కాంక్రీట్ జంగిల్‌లో ఉండి విసిగిపోయిన వారికి కాస్త రిలీఫ్ కావాలంటే ఖచ్చితంగా సెకండ్ హోమ్ కావాల్సిందే అని చాలా మంది అంటున్నారు.

Also Read: కోటి రూపాయలకు మించి ధర ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్.. హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..

ఇక హైదరాబాద్‌లో సస్టైనబుల్ హౌజెస్‌కు ఉన్న డిమాండ్ మేరకు ధరలున్నాయి. ఒక్కో ప్రాజెక్టులో కనీసం 300 గజాల నుంచి ఎకరం, రెండెకరాల వరకు సస్టైనబుల్ హౌజ్ ప్రాజెక్టులను డిజైన్‌ చేస్తున్నారు. నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో అయితే విస్తీర్ణం, ఇంటి నిర్మాణాన్ని బట్టి కోటిన్నర నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు రేట్లున్నాయి. ఐతే హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఐతే 80 లక్షల నుంచి కోటిన్నర రూపాయల వరకు సస్టైనబుల్ హౌజెస్ అందుబాటులో ఉన్నాయి. మరి కొన్ని ప్రాజెక్టుల్లో ఇళ్లన్నీ ఒకచోట నిర్మించి.. మొత్తం ఫామ్ ల్యాండ్ అంతా కామన్ ఏరియాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల్లో సైతం కోటి రూపాయల నుంచి రెండున్నర కోట్ల వరకు ధరలున్నాయి. మరి మీ బడ్జెట్ ను బట్టి మీరూ సస్టైనబుల్ హౌజ్ కోసం ప్రయత్నించండి.