Gold: బాబోయ్.. బంగారం రికార్డులే రికార్డులు.. ఆశ్చర్యపరుస్తున్న డబ్ల్యూజీసీ తాజా గణాంకాలు.. 2025 చివరి నాటికి..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా గణాంకాలు ప్రకారం.. 2024లో బంగారం 40 కంటే ఎక్కువసార్లు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసింది.

Gold
Gold Rate: బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. బ్రేక్ లేకుండా రోజురోజుకు ఆకాశమే హద్దుగా గోల్డ్ రేటు దూసుకెళ్తుంది. తొలిసారిగా ఔన్స్ (31.1గ్రాములు) బంగారం రేటు 3వేల డాలర్లు దాటింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత రికార్డుల ప్రకారం.. బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున నాలుగున్నరేళ్లు పట్టేది. కానీ, ప్రస్తుతం కేవలం 210 రోజుల్లోనే (ఏడు నెలల్లోనే) ఔన్స్ గోల్డ్ ధర 2500 డాలర్ల నుంచి 3వేల డాలర్లకు చేరుకుంది. దీనిని బట్టి గోల్డ్ పరుగు ఏ స్థాయిలో వేగం అందుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే దూకుడు కొనసాగితే.. 2025 ఏడాది చివరి నాటికి ఔన్స్ ధర 4వేల డాలర్లను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజాగా గణాంకాలు ప్రకారం.. 2024లో బంగారం 40 కంటే ఎక్కువసార్లు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. 2025 సంవత్సరంలో ఇప్పటికే 16సార్లు కొత్త గరిష్టాలను గోల్డ్ రేటు నమోదు చేసింది. ఢిల్లీలో తాజాగా 24 క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.91,650 పలికింది. ఈనెల 19న రూ.91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది.
Also Read: Gold Prices: బంగారం కొంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే..
అంతర్జాతీయంగా 2005 డిసెంబర్ నెలలో బంగారం ఔన్స్ ధర తొలిసారిగా 500 డాలర్ల మార్కును తాకింది. ఆ తదుపరి 500డాలర్ల నుంచి 1,000 డాలర్ల స్థాయిని 2008 మార్చిలో (834రోజుల సమయం పట్టింది) చేరుకుంది. 2011 ఏప్రిల్ నెలలో 1,500 డాలర్లకు (1,132 రోజులు పట్టింది) చేరుకుంది. 2020 అగస్టులో 2,000 డాలర్లకు (3,304 రోజులు పట్టింది) చేరుకుంది. 2024 ఆగస్టులో 2,500 డాలర్లకు (1,473 రోజులు పట్టింది) చేరుకుంది. 2025 మార్చిలో 3వేల డాలర్లకు ( 210 రోజులు మాత్రమే పట్టింది) చేరుకుంది.