Yes Bank సంక్షోభం : ఈడీ అదుపులో రాణాకపూర్..ఎన్ని వేల కోట్లు మింగారో!

యెస్ బ్యాంక్ సంక్షోభంలో అసలు దోషుల బెండు తీసేందుకు ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయ్. ఇప్పటికే బ్యాంక్ వ్యవస్థాపకుడైన రాణాకపూర్‌ని అదుపులోకి తీసుకుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. బ్యాంక్‌ని ముంచి రాణాకపూర్ ఎన్ని వేల కోట్ల సొమ్ము మింగేశాడో తెలుసుకునే పనిలో పడింది ఈడీ.
యెస్ బ్యాంక్ సంక్షోభానికి మూలకారకుడిగా భావిస్తున్న రాణాకపూర్‌ని మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్‌ని ఆర్ధిక సంక్షోభం నుంచి బైట పడేసేందుకు RBI రంగంలోకి దిగిన వెంటనే అసలు బ్యాంక్ ప్రస్తుత దుస్థితికి కారణమెవరనే కోణంలో కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది.
ఈ క్రమంలోనే యెస్ బ్యాంక్ ఫౌండర్ రాణాకపూర్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇంటరాగేట్ చేసింది. ముంబై వర్లీ ఏరియాలోని ఆయన నివాసంలో సోదాలు జరిపింది. ఆ తర్వాత మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే నిర్ధారణతో అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే అతనిపై సీబీఐ కూడా FIR దాఖలు చేసింది. రాణాకపూర్ బ్యాంక్ వ్యవస్థాపకుడిగా తనకి ఉన్న వెసులుబాటుని ఉపయోగించుకుని అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.
బ్యాంక్ నుంచి కంపెనీలకు భారీగా అప్పులు మంజూరు చేయడం..తిరిగి ఆ కంపెనీల నుంచి పెట్టుబడులను రప్పించేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ఈడీ తేల్చింది. రాణాకపూర్ భార్య, ముగ్గురు కుమార్తెల పేరుతో ఇలా దాదాపు 20 వరకు షెల్ కంపెనీలు ఏర్పాటైనట్లు తేలడంతో రాణాకపూర్ మెడకి మనీలాండరింగ్ ఆరోపణలు బిగుసుకున్నాయి. ప్రధానంగా గత ఏడాది దివాళా తీసిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ DHFLకు యెస్ బ్యాంక్ రూ. 3700 కోట్లు రుణం ఇవ్వగా ఇవన్నీ మొండిబకాయిలుగా మారిపోయాయి.
ఈ ఒక్క కంపెనీ నుంచే రాణాకపూర్ ఫ్యామిలీకి రూ. 600 కోట్లు ముడుపుల రూపంలో ముట్టినట్లు ఈడీ తేల్చింది. ఇంకా DHFL తరహాలోనే..చాలా కార్పొరేట్ కంపెనీలు కపూర్ ఫ్యామిలీకి చెందిన షెల్ కంపెనీలకు సొమ్ము తరలించినట్లు తెలుస్తోంది. ఇలా సైడ్ చేసిన సొమ్ముతో రాణాకపూర్ ఫ్యామిలీ దాదాపు 2 వేల కోట్ల రూపాయలను ఇతర ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఈడీ గుర్తించింది.
అక్రమ మార్గాల్లో నిధులు స్వీకరించిన కపూర్ కుటుంబం రూ 2000 కోట్ల వరకూ వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. వీటి విలువ ప్రస్తుతం 5 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. యెస్ బ్యాంక్ వ్యవహారంలో కేంద్రం కఠిన చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీబీఐ కూడా రంగంలోకి దిగింది. ఈడీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేయబోతోంది.
Read More : మరణమృదంగం : క్యా కరోనా..3 వేల 98 మంది మృతి