రిజిస్ట్రేషన్లలో జోరుగా రాబడి 

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 07:18 AM IST
రిజిస్ట్రేషన్లలో జోరుగా రాబడి 

Updated On : January 13, 2019 / 7:18 AM IST

హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిష్ట్రేషన్ల రాబడి జోరుగా సాగుతోంది. భూములు, స్థలాలు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల రాబడి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఈ సారి రికార్డు స్థాయిలో 29.03 శాతం మేర రిజిస్ట్రేషన్ల రాబడిలో వృద్ధి నమోదు అయింది. తొలి మూడు త్రైమాసికాల్లోనే 90.37 శాతం లక్ష్యాన్ని సాధించింది. మిగతా సొమ్ము చివరి త్రైమాసికంలో వచ్చేస్తుందని స్టాంపులు..రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

స్థిరమైన ప్రభుత్వం, శాంతి భద్రతలు సజావుగా సాగుతుండటం, ఔటర్ రింగ్ రోడ్లు, టీఎస్-ఐపాస్ వంటి అనుకూల కారణాల వల్ల భూముల క్రయ విక్రయాలు పెరిగాయి. దాంతో రిజిస్ట్రేషన్లు కూడా అదే స్థాయిలో సాగాయి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలోని 12 రిజిస్ట్రేషన్ జిల్లాలో మొత్తం 10, 92, 289 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అందుకనుగుణంగానే రాబడి కూడా సమకూరింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థల ’ట్రాన్స్ ఫర్ డ్యూటీ’ని మినహాయించి రూ.4700 కోట్ల నికర ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పూర్తైన మొదటి మూడు త్రైమాసికాల్లో మొత్తం రూ.4247.52 కోట్ల రాబడి వచ్చింది. ఇది లక్షిత రాబడిలో 90.37 శాతం. గత సంవత్సరం (2017-18) ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన నికర ఆదాయం కంటే ఈ సారి 29.03 శాతం అదనంగా వచ్చింది. గతేడాది రూ.3,700 కోట్ల నికర రాబడిని నిర్దేశించుకోగా, డిసెంబర్ వరకు రూ.3291.93 కోట్లు వచ్చాయి. చివరి త్రైమాసికంలో లక్ష్యాన్ని అధిగమిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. 2018 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అత్యధికంగా మెదక్ జిల్లాలో 62.97 శాతం రాబడి వృద్ధి నమోదు అయింది.