రంగులాటాడితే రంగు పడుద్ది…!

  • Published By: murthy ,Published On : August 14, 2020 / 04:06 PM IST
రంగులాటాడితే రంగు పడుద్ది…!

Updated On : August 14, 2020 / 4:44 PM IST

స్మార్ట్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగాక కుప్పలు తెప్పలుగా ఆన్ లైన్ గేమ్స్ వచ్చి చేరుతున్నాయి. యాప్ ల ద్వారా, ఇతర మర్గాల ద్వారా వినియోగ దారులను ఆకర్షించి వారి జేబులు గుల్ల చేస్తున్నాయి. ఈ కామర్స్ పేరుతో సంస్ధల్ని, వెబ్ సైట్స్ ను రిజిష్టర్ చేస్తున్న చైనా కంపెనీలు ఈ ముసుగులో ఆన్ లైన్ గేమ్స్ ను ప్రోత్సహిస్తూ యువతను బానిసలను చేసి భారీగా డబ్బు కొల్లగొడుతున్నాయి.తాజాగా కలర్ ప్రిడిక్షన్ పేరుతో తయారు చేసిన ఒక గేమ్ ఏడాది కాలంలో రూ.1100 కొల్లగొట్టిందంటే నమ్ముతారా.

దీనిపై ఫిర్యాదు చేయటంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ జరిపి ఒక చైనా జాతీయుడితో పాటు, మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ గేమ్ నిర్వహిస్తున్న కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.30 కోట్లను ఫ్రీజ్ చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజన్ కుమార్ వెల్లడించారు.

ఏమిటీ కలర్‌ ప్రిడిక్షన్‌ ఆట ?
చైనాకు చెందిన సూత్రధారులు భారత్‌లో ఉంటున్న యువతను టార్గెట్‌ చేస్తూ కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ను తయారుచేశారు. ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఈ సూత్రధారులు.. ఈ–కామర్స్‌ లావాదేవీల పేరుతో అక్కడి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో (ఆర్వోసీ) ఎనిమిది సంస్థల్ని రిజిష్టర్ చేశారు. ఇవన్నీ ఆన్‌లైన్‌లో వివిధ ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు నడుపుతున్నాయి. ఈ సైట్స్‌లోకి ప్రవేశించినవారు ఓ మూలన ఉండే లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌లోకి వెళ్లొచ్చు.

ఎలా ఆడతారు ?
అయితే ఎవరికి వారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. అప్పటికే ఈ గేమ్‌ ఆడుతున్న వారు ఇచ్చే రిఫరల్‌ ఐడీ ద్వారా మాత్రమే గేమ్‌లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. గేమ్‌లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న ఆప్షన్‌లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఒకటి ఎంచుకోవాలి. దానిపై ఎంత మొత్తం పందెం కాస్తున్నామో పేటీఎం ద్వారా చెల్లించాలి. ఇది పూర్తయిన తర్వాత గేమ్‌లో ప్రోగ్రామింగ్‌ రన్‌ అయి, ఓ రంగు పైకి వచ్చి ఆగుతుంది. పందెం కాసినవారు ఎంచుకున్న రంగు వస్తే ఆ మొత్తానికి రెండు నుంచి నాలుగు రెట్ల డబ్బు వారి పేటీఎం ఖాతాలోకి జమ అవుతుంది. రాకపోతే పందెం కాసిన మొత్తం ఆ సంస్థకు చెందుతుంది.

ఎలా మోసం చేస్తారంటే
నిర్వాహకులు ఈ గేమ్‌ను ఓ ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ ద్వారా తయారు చేశారు. ఓ కొత్త వ్యక్తి ఇందులోకి ప్రవేశించినప్పుడు అతడి ఐపీ అడ్రస్, ఇతర వివరాలను అది సంగ్రహిస్తుంది. అనంతరం తొలుత కొన్నిరోజులపాటు అతడు పందెం గెలిచేలా చేసి ఆటకు బానిసగా మారుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు కొన్ని గేమ్‌లలో ఓడేలా.. పూర్తిగా బానిసగా మారిన తర్వాత అన్నీ ఓడిపోయేలా ప్రోగ్రామింగ్‌ డిజైన్‌ చేసి ఉంటోంది.

నష్టపోవటమే తప్ప లాభపడటం అనేదిలేదు
దీంతో దీని వలలో చిక్కి గేమ్‌ ఆడినవాళ్లు నష్టపోవడమే తప్ప.. లాభపడటం అనేది జరగట్లేదు. ఇలా నష్టపోయినవారిని దళారులుగా మార్చుకుంటూ మరికొంత మందిని తమ వలలో చిక్కేలా గేమ్‌ నిర్వాహకులు పథకం వేశారు. ఈ గేమ్‌లో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా కొత్తవారిని ఆకర్షించి వారికి రిఫరల్‌ కోడ్‌ ఇస్తే.. రూ.1000 కమీషన్‌గా ఇస్తున్నారు. అంతేకాకుండా అతడు ఆడి, కోల్పోయే మొత్తం నుంచి 10 శాతం కూడా ఇస్తున్నారు. ఇలా మరింతమందిని ఈ ఉచ్చులో దింపేలా వారిని ప్రోత్సహిస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో పెరిగిన సభ్యులు…ఆత్మహత్యలు
లాక్‌ డౌన్‌ అమలులోకి వచ్చిన తర్వాత ఈ గేమ్‌ ఆడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ ఉచ్చులో చిక్కి రూ.లక్షల్లో కోల్పో యిన అనేక మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. హైదరాబాద్‌లో రూ.6 లక్షలు కోల్పోయిన ఎస్సార్‌నగర్‌ యువకుడితో పాటు రూ.15 లక్షలు కోల్పోయిన ఆదిలాబాద్‌ యువకుడు, తమిళనాడులో పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు రూ.97వేలు, మరో యువకుడు రూ.1.64 లక్షలు పోగొట్టుకోవడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ సంస్థలు, వ్యవహారాలను చైనాకు చెందిన బీజింగ్‌ టి పవర్‌ అనే సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు నిర్ధారిం చారు. ఈ ఆధారాలను బట్టి ఢిల్లీలో ఉంటున్న ఈ సంస్థ సౌత్‌ఈస్ట్‌ ఏషియా ఆపరేషన్స్‌ హెడ్‌గా ఉన్న చైనా జాతీయుడు యా హౌతో పాటు డైరెక్టర్లుగా పని చేస్తున్న ఢిల్లీ వాసులు ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్, నీరజ్‌ తులేలను అరెస్టు చేశారు. వీరిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో 28 కేసులు నమోదు కావడంతో అరెస్టు సమాచారాన్ని ఆయా అధికారులకు తెలపాలని నిర్ణయించారు.