తెలంగాణాలో పులుల సంచారం …భయాందోళనలో ప్రజలు

  • Published By: murthy ,Published On : November 15, 2020 / 12:36 PM IST
తెలంగాణాలో పులుల సంచారం …భయాందోళనలో ప్రజలు

Updated On : November 15, 2020 / 12:51 PM IST

tigers tension in telangana districts  : తెలంగాణ రాష్ట్రంలో పులులు జనా వాసాల మధ్య సంచారం చేయటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లి, బుద్వేల్, కాటేదాన్ పరిసరాల్లో చిరుత పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తాజాగా రాష్ట్రంలోని రెండు జిల్లాలో పులుల సంచారం స్ధానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అలజడి రేపిన పులి సంచారం, గ్రామీణ ప్రాంత ప్రజలను నిద్రపోనివ్వటం లేదు. దిగిడలో ఒక యువకుడిని హత మార్చిన పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు 35 మంది సిబ్బందితో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను అమర్చి పులి ఆనవాళ్లను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.



పులి దాడి చేసిన దహేగ మండలం, దిగడ గ్రామంతో పాటు చుట్టు పక్కల 10 కిలో మీటర్లు మేర విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.  పెద్దపులి  సంచరిస్తోందని భావిస్తున్న పెద్దావాగు పరిసర ప్రాంతాల్లో కూడా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి సంచారంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

మరో వైపు మహబూబా బాద్ జిల్లాలోనూ పెద్దపులి సంచారం గుబులు పుట్టిస్తోంది. గుంజేడు ముసలమ్మ ఆలయం వద్ద భక్తులు ఇచ్చే జంతుబలిలో రక్తపు రుచి మరిగిన పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పాదముద్రల ఆధారంగా రెండు పులులు సంచరిస్తున్నట్లు స్ధానికులు భావిస్తున్నారు.



ఇటీవలే రాంపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి ఒక ఆవును చంపింది. తాజాగా గుంజేడు ముసలమ్మ దేవాలయం ప్రాంతంలో పులి పాద ముద్రలను ప్రజలు గుర్తించారు. పులిని ప్రత్యక్షంగా చూసిన వారు భయంతో వణికిపోతున్నారు. పులి సంచారం వార్తతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.



కొత్తగూడ మండలంలోని గుంజేడు దేవాలయ పరిసర ప్రాంతాల్లో జంతు బలులు అధికంగా జరగటం వలన, రక్తం వాసన మరిగిన పులులు ఇక్కడే సంచరిస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. గత వారం రోజులుగా ప్రజలు పులి భయంతో వణికిపోతూ జీవిస్తున్నారు.