కరోనాతో మహిళ మృతి : ఒంటిపై విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు మాయం

కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… శవాలపై పేలాలు ఏరుకునే చందంగా మారిందని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్ధితిపై రోగుల బంధువులు వాపోతున్నారు .
హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కరోనా సోకి ఒక మహిళ ఆదివారం మృతి చెందింది. రెండ్రోజుల క్రితం కరోనాతో బాధిత మహిళ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. కాగా ఆస్పత్రిలో చేరే సమయంలో మృతురాలి శరీరంపై బంగారు ఆభరణాలు ఉన్నాయని, వజ్రాల చెవి కమ్మలు, ముక్కుపుడక కూడా మాయమైనట్లు బంధువులు ఆరోపించారు.
ఈ విషయమై ఆస్పత్రి వర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవటంతో వారు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ఘటనకు పాల్పడింది ఆస్పత్రి సిబ్బందేనా…?లేక బంధువుల పనా ?… లేకుంటే మరెవరైనా చేశారా?అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.