Delhi: పద్నాలుగేళ్ల బాలికపై తాంత్రికుడి అత్యాచారం.. భూతవైద్యం పేరుతో ఘాతుకం
బాలిక కాస్త వింతగా ప్రవర్తిస్తుండటంతో, బాలికకు దెయ్యం పట్టిందేమోనని బాలిక తల్లి భావించింది. దీంతో బాలికను ఆమె తల్లి ఒక భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లింది. అతడు భూతవైద్యం పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Delhi: భూతవైద్యం పేరుతో ఒక తాంత్రికుడు దారుణానికి పాల్పడ్డాడు. పద్నాలుగేళ్ల బాలికపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయంపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్‌కు చెందిన పద్నాలుగేళ్ల బాలికకు కొంత కాలంక్రితం అనారోగ్యం సోకింది.
అలాగే బాలిక కాస్త వింతగా ప్రవర్తిస్తుండటంతో, బాలికకు దెయ్యం పట్టిందేమోనని బాలిక తల్లి భావించింది. దీంతో బాలికను ఆమె తల్లి ఒక భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లింది. అతడు భూతవైద్యం పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక ఇటీవల గర్భం దాల్చింది. ప్రస్తుతం బాలిక రెండు నెలల గర్భిణి. తన కూతురు గర్భం దాల్చడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 4న హైదరాబాద్‌లో కూడా ఒక బాలికపై ఆమె స్నేహితులు ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తు పదార్థాలిచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసు విచారణ కూడా కొనసాగుతోంది.