20 ఏళ్ల కూతురిని రూ.10వేలకు అమ్మేసిన తండ్రి.. కొనుక్కున్నోడు డబ్బు కట్టలేదు.. ఓ మహిళ కన్నీటి గాథ

నిస్సహాయత నిండిన ఆమెను సాకడం భారం అనుకున్న కన్నతండ్రే పది వేల రూపాయలకు అమ్మేశాడు. ఇదే అదనుగా ఆ అభాగ్యురాలి జీవితాన్ని యజమానులం అనే అహంకారం పలు మార్లు చిదిమేసింది. అది చాలదన్నట్లు మరికొందరి రాక్షసానందం కోసం ఇంకో నరకానికి తోసేశారు. చిద్రమైన మనస్సును.. మలినమైన శరీరాన్ని కాపాడేవాళ్లే కరువైన దిక్కుతోచని పరిస్థితుల్లో సజీవ దహనానికి పాల్పడింది ఆ అబల.
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో జరిగిన ఘటన బంధాలను నీరుగార్చి.. మానవత్వాన్ని మంటగలిపింది. ఫలితంగా 80శాతం కాలిన దేహంతో మహిళ ఢిల్లీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుంది. వివరాల్లోకి వెళితే.. చిన్న వయస్సులోనే పెళ్లి చేసిన కూతురు 20 ఏళ్లకే వితంతువుగా మారడంతో రూ.10వేలకు అమ్మేశాడు కన్నతండ్రి. ఆమెను కొనుక్కున్న యజమాని వేధించడంతో పాటు, పలు మార్లు అత్యాచారం చేశాడు. నిజానికి మహిళను కొనుగోలు చేసేందుకు డబ్బులేని ఆ వ్యక్తి స్నేహితుల దగ్గర అప్పు తీసుకున్నాడట. అది తీర్చలేక ఇంటి పనులు చేయమంటూ వారి దగ్గరకు పంపించాడు.
బానిస బతకును చూసి వారి పైశాచికత్వం బయటికి వచ్చింది. రాక్షసంగా హింసించి పలుమార్లు అత్యాచారం జరిపారు. కష్టం తీర్చడానికి కన్నతండ్రి రాడు. సొమ్ముకు ఆశపడిన పోలీసులు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక, బాధ చెప్పుకోవడానికి మనిషి అనే వాడే కనిపించక తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది మహిళ. 80శాతం కాలిన శరీరంతో ఉన్న మహిళను స్థానికులు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. విషయం హాపూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యశ్వీర్ సింగ్ తెలియడంతో చర్యలు చేపట్టారు. 14 మందిపై పలు సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేశామని తెలిపారు.
ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బాధితురాలికి సహాయం చేయాలని లేఖరాసింది. గ్యాంగ్ రేప్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయని యూపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.