Coimbatore Court : 35 ఏళ్లనాటి కేసు.. ఆర్టీసీ మాజీ ఉద్యోగికి 383 ఏళ్ల జైలుశిక్ష, రూ.3.32 కోట్ల జరిమానా
చేసింది నేరమైతే శిక్ష తప్పదని న్యాయస్థానం మరోసారి నిరూపించింది. రిటైర్ అయినా శిక్ష అనుభవించి తీరాలను తీర్పునిచ్చింది. 82 ఏళ్ల వ్యక్తికి ఏకంగా 383 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

tamil nadu RTC 35 Years case ex staffer 383 years prison
Coimbatore Court -Tamil Nadu : నేరం చేస్తే ఎన్నాళ్టికైనా శిక్ష తప్పదు అనేలా తమిళనాడులో 35 ఏళ్ల నాటి కేసులో ఓ మాజీ ఉద్యోగికి కోర్టు కనీ వినీ ఎరుగని శిక్ష విధించింది. నకిలీ పత్రాలను సృష్టించి, మోసానికి పాల్పడనందుకు తమిళనాడు ఆర్టీసీ మాజీ ఉద్యోగికి 383 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3.32 కోట్ల జరిమానా విధించింది కోర్టు. వింటేనే షాక్ అయ్యేలాంటి తీర్పునిచ్చింది కోయంబత్తూర్ కోర్టు.
ఈకేసు వివరాల్లోకి వెళితే..అది 1988 నవంబర్ 9. చేరన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోయంబత్తూర్ డివిజన్ పరిధిలోని బస్సుల వేలం ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు అందింది. 47 బస్సులను నకిలీ పత్రాలతో రూ. 28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి రూ. 28 లక్షలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైసామి, రంగనాథన్, రాజేంద్రన్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టుకు ఈ వివరాలను సబ్మిట్ చేయగా కోర్టులో కేసు విచారణ జరుగుతునే ఉంది. ఈక్రమంలో నటరాజన్, రామచంద్రన్,రంగనాథన్, రాజేంద్రన్ మృతి చెందారు. కానీ జీవించి ఉన్నవారిలో కోదండపాణి మినహాయించి మిగిలిన ముగ్గురిని న్యాయస్థానం నిర్ధోషులుగా పేర్కొంది.
ఆర్టీసీని మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ కేసులకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు మరో 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మూడింటిని కలిపితే మొత్తం 383 సంవత్సరాల శిక్ష అవుతుంది. ఇప్పుడు కోదండపాణి వయసు 82 ఏళ్లు. దీంతో కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి పీకే శివకుమార్ ఆదేశించారు.
కాగా.. చేరన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్‌గా పనిచేసిన కోదండపాణి.. ఆ సంస్థకు చెందిన సొమ్ము చెల్లించకుండానే 14 బస్సులను వేలంలో దక్కించుకున్న వ్యక్తులకు అప్పగించినట్టు నేరం రుజువైంది. దీంతో కోర్టు ఈ వినూత్న తీర్పునిచ్చింది. నేరం చేసి తప్పించుకోలేరని న్యాయస్థానం మరోసారి నిరూపించినట్లైంది.