UPలో మరో ఘోరం : వెన్నెముక విరిచారు, మత్తుమందు ఇచ్చి అత్యాచారం

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 10:59 AM IST
UPలో మరో ఘోరం : వెన్నెముక విరిచారు, మత్తుమందు ఇచ్చి అత్యాచారం

Updated On : October 1, 2020 / 11:20 AM IST

up woman : ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. మహిళలపై వరుస అఘాయిత్యాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో కన్నీటి శోకాన్ని మిగులుస్తున్నాయి. హత్రాస్‌ ఘటనపై దేశం మొత్తం రగిలిపోతుండగా ఆ గ్రామానికి కేవలం 5వందల కిలోమీటర్ల దూరంలో మరో మహిళపై అదే తరహా అఘాయిత్యం జరగడం కలకలం రేపుతోంది. యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేసి చిత్రహింసలు పెట్టారు రాక్షసులు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆ యువతిని చికిత్స కోసం తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయింది.



బల్‌రామ్‌పూర్‌కు చెందిన ఓ దళిత మహిళ రోజులానే కూలీ పనికి వెళ్లింది. అయితే సమయానికి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సాయంత్రం 7 గంటల సమయంలో నడవలేని స్థితిలో, చేతికి సెలైన్‌ బాటిల్‌తో ఈ-రిక్షాలో ఇంటికి చేరింది బాధితురాలు. కడుపులో నొప్పిగా ఉందని, నడవలేనని తల్లికి చెప్పింది. తనను రక్షించాలని, తనకు చావాలని లేదంటూ ఏడుస్తూ తన తల్లిని బతిమాలింది.



దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతిని పరిశీలించిన డాక్టర్‌ ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అచేతన స్థితిలో ఉన్న ఆమెను లక్నోకు తీసుకెళ్తుండగా, బల్‌రామ్‌పూర్‌ నగరం దాటకముందే కన్నుమూసింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేయగా సంచలన విషయాలు బయటికొచ్చాయి.



బాధిత యువతికి మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని రిపోర్టులో తేలింది. మృగాళ్లు ఆమె వెన్నెముకను విరచేయడంతోపాటు శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచారని డాక్టర్లు చెప్పారు. యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆమె సోదరుడు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.



మరోవైపు…యూపీలోని బాగ్‌పత్‌లో మరో ఘోరం వెలుగుచూసింది. సెప్టెంబర్‌ 27న బయటకు వెళ్లిన బాలికపై అత్యాచారం జరిగింది. దీంతో ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆరా తీయగా తనపై అత్యాచారం జరిగిందని ఆ బాధ భరించలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు తెలిపింది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



అయితే హత్రాస్‌ ఘటన జరిగి నెల కూడా కాకుండానే అదే తరహా ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. హత్రాస్‌ మృతురాలికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించడం, మహిళలపై జరుగుతున్న వరుస ఘటనలపై యూపీ దద్దరిల్లిపోతోంది. హత్రాస్‌ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ నేతలు క్యాండిల్‌ ర్యాలీ చేశారు. మహిళలపై అఘాయిత్యాలు ఆపాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళలకు రక్షణ ఏది అంటూ రగిలిపోయారు. ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. ఉద్రిక్తత నెలకొనడంతో పలు చోట్ల నేతలను అరెస్ట్‌ చేశారు పోలీసులు.