Atiq Ahmed Story: అతిక్ అహ్మద్ హత్య.. కుప్పకూలిన నేర సామ్రాజ్యం

గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతిక్ అహ్మద్ చివరి రోజుల్లో కొడుకును కాపాడుకోలేక నిస్సహాయుడిగా మిగిలాడు. నేరస్తుల అంతిమ గమ్యం పతనమే అని మరోసారి రుజువయింది.

Atiq Ahmed Story: అతిక్ అహ్మద్ హత్య.. కుప్పకూలిన నేర సామ్రాజ్యం

Updated On : April 16, 2023 / 2:09 PM IST

Atiq Ahmed Story: ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కారు దెబ్బకు కరుడుగట్టిన నేరస్తులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకప్పుడు నేరాల బాట బట్టి.. రాజకీయ పార్టీల అండదండలతో ఎదిగిన కిరాతకులు కడతేరిపోతున్నారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన మరుక్షణం నుంచే నేరస్తుల ఏరివేత మొదలైంది. తాజాగా గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతడి కుటుంబ సభ్యులు హతమయ్యారు. 100 పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న అతిక్ అహ్మద్ పోలీసుల సమక్షంలోనే హత్యకు గురికావడం సంచలనం రేపింది. గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతడు.. చివరి రోజుల్లో జైలుపాలయి, కొడుకును కాపాడుకోలేక నిస్సహాయుడిగా మిగిలాడు. నేరస్తుల అంతిమ గమ్యం పతనమే అని మరోసారి రుజువయింది.

Atiq Ahmed Brother Son
పేదరికాన్ని జయించడానికి డబ్బు సంపాదననే ముఖ్యమని చిన్నతనంలోనే గ్రహించి అతిక్ అహ్మద్ నేరాల బాట పట్టాడు. 17 ఏళ్ల వయసులోనే అతిక్ అహ్మద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తర్వాత వరుసగా నేరాలు చేస్తూ గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫుల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ కూడా అయ్యాడు. యోగి ఆదిత్యనాథ్(yogi adityanath )ముఖ్యమంత్రి అయిన తర్వాత అతిక్ అహ్మద్ నేర సామ్రాజ్యం కూలడం మొదలయింది.

100కి పైగా కేసులు
గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతిక్ అహ్మద్ దశాబ్దాల పాటు యూపీ ప్రజలను వణికించాడు. ముఖ్యంగా అలహాబాద్ లో సమాంతర పాలన సాగించి సంఘ విద్రోహ శక్తిగా మారాడు. దోపిడీ, కిడ్నాప్, బెదిరింపులు, హత్యతో సహా 100కి పైగా కేసులు అతడిపై ఉన్నాయి. రాజకీయాలను అడ్డం పెట్టుకుని నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని విధంగా తన సామ్రాజ్యాన్ని ఏలాడు. పేదింట్లో పుట్టిన అతిక్ అహ్మద్.. చాలా చిన్నవయసులోనే నేరాల బాట పట్టాడు. తన ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడం.. సాక్షులకు లంచం ఇవ్వడం, బెదిరించడం ద్వారా చట్టానికి దొరక్కుండా తప్పించుకునే వాడని అతడి పూర్వీకుల గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.

రాజకీయాల అండతో..
ప్రస్తుత ప్రయాగ్‌రాజ్(Prayagraj) గా మారిన ఒకప్పటి అలహాబాద్‌లో 1962లో అతిక్ అహ్మద్ జన్మించాడు. బాల్యమంతా పేదరికంలో గడిపిన అతడు హైస్కూల్ లోనే చదువుకు ఎగనామం పెట్టాడు. అతిక్ అహ్మద్ తండ్రి బతుకుదెరువు కోసం పట్టణంలో గుర్రపు బండి నడిపేవాడు. పేదరికం నుంచి బయటపడేందుకు నేరాల బాట పట్టాడు అతిక్ అహ్మద్. సులువుగా డబ్బు సంపాదించేందుకు రైళ్లలో బొగ్గును దొంగిలించి, విక్రయించడం మొదలుపెట్టాడు. కాంట్రాక్టర్లను బెదిరించి రైల్వే స్క్రాప్ మెటల్ టెండర్లను దక్కించుకున్నాడు. కేసుల నుంచి బయటపడాలంటే అధికారం కావాలని గ్రహించిన అతిక్.. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.

ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యే
27 సంవత్సరాల వయస్సులో 1989లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వివాదరహిత బాహుబలిగా పేరొంది.. అదే ఏడాది అలహాబాద్ పశ్చిమ(Allahabad West) అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అక్కడి నుంచి అతడి రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు శాసనసభ సభ్యునిగా గెలిచి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. 1996లో ఇదే స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు.

రాజుపాల్ హత్యతో పతనం
1998లో సమాజ్‌వాదీ పార్టీ మొండిచేయి చూపడంతో సోన్ లాల్ పటేల్ స్థాపించిన అప్నా దళ్ (ఏడీ) పార్టీలో చేరారు. 1999 నుంచి 2003 వరకు అప్నా దళ్ యూపీ అధ్యక్షుడిగా కొనసాగాడు. 2004లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఫుల్‌పూర్(Phulpur) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచాడు. పార్లమెంట్ కు ఎన్నికైన తర్వాత ప్రయాగ్‌రాజ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన సోదరుడు అజీమ్ అహ్మద్ ను పోటీకి నిలబెట్టాడు. అయితే బీఎస్పీ అభ్యర్థి రాజుపాల్ చేతిలో అజీమ్ ఓటమిపాలయ్యాడు. 2005, జనవరి 5న ప్రయాగ్‌రాజ్ లో రాజుపాల్ హత్యకు గురయ్యాడు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అజీమ్ గెలిచాడు. రాజుపాల్ హత్య కేసులో అతీక్, అజీమ్ నిందితులుగా ఉన్నారు.

జర్నలిస్టు వేషాల్లో వచ్చి కాల్పులు
మరుసటి ఏడాది అంటే 2006లో రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్(umesh pal) ను అపహరించి, హత్య చేశారు. ఈ కేసులో అతీక్, అజీమ్ లకు ప్రయాగ్‌రాజ్ కోర్టు జీవితఖైదు విధించింది. గుజరాత్ లోని సబర్మతీ జైలులో అతీక్, యూపీలోని బరేలీలో అజీమ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఉమేశ్ పాల్ కేసు విచారణలో భాగంగానే శనివారం రాత్రి అన్నదమ్ములిద్దరినీ వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా జర్నలిస్టు వేషాల్లో వచ్చిన ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరిపారు. అతీక్, అజీమ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో సీఎం యోగి ఆదిత్యనాథ్ జ్యుడీషియల్ కమిషన్ నియమించారు.

Also Read: అతీక్ అహ్మద్ సోదరుల హత్యకేసులో నిందితులు కరుడుగట్టిన నేరస్తులు.. వారి కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..

బాధితుల హర్షం.. విపక్షాల విమర్శలు
అతీక్, అజీమ్ ల హత్యపై బాధిత కుటుంబాలకు చెందిన వారు హర్షం ప్రకటించారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని అంటున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇద్దరినీ కాల్చిచంపడాన్ని బట్టి చూస్తే యూపీలో శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో తెలుస్తోందని ప్రతిపక్ష నాయకుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. శాంతిభద్రల పరిరక్షణలో సీఎం యోగి ఆదిత్యనాథ్ విఫలమయ్యారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) విమర్శించారు.

కుటుంబమంతా నేరస్తులే
అతిక్ అహ్మద్(Atiq Ahmed) తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేర చరిత్ర ఉంది. 1996లో షాయిస్తా పర్వీన్ ను అతిక్ పెళ్లాడాడు. వీరికి ఐదుగురు కొడుకులు అలీ, ఉమర్, అసద్, అజాన్, అబాన్. వీరిలో అసద్.. ఇటీవల పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. మిగతా వారిలో అలీ, ఉమర్ జైలులో ఉన్నారు. అజాన్, అబాన్.. గృహనిర్భందంలో ఉన్నారు. ఉమేశ్ పాల్ హత్య కేసు (umesh pal case) లో నిందితురాలిగా ఉన్న అతడి భార్య షాయిస్తా పర్వీన్ పరారీలో ఉంది. అతిక్ అహ్మద్ తన సోదరుడు అజీమ్ తో పాటు దుండగుల కాల్పుల్లో హతమయ్యాడు.