భజరంగ్‌దళ్ నిర్వాకం : పెళ్లి చేసిన జంట ఆత్మహత్యాయత్నం

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 04:45 AM IST
భజరంగ్‌దళ్ నిర్వాకం : పెళ్లి చేసిన జంట ఆత్మహత్యాయత్నం

Updated On : February 16, 2019 / 4:45 AM IST

ప్రేమికుల దినోత్సవంనాడు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పెళ్లి చేసిన జంట ఆత్మహత్యకు యత్నించింది. ఇంటికి వెళ్లలేక… తమ పరువు పోయిందని భావించిన ఆ జంట… హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన లేక్‌ పోలీసులు ప్రేమికులను రక్షించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మరోవైపు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలపై అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమ జంటకు బలవంతంగా పెళ్ళి చేశారు. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలోని ఆక్సీజన్‌ పార్కులో జరిగిందీ ఈ ఘటన. ఈ పార్కులోకి వచ్చిన భజరంగ్‌దళ్‌ కార్యకర్తలకు ప్రేమజంట కంటపడింది. వెంటనే వెనుకాముందు ఆలోచించకుండా…. బలవంతంగా ఇద్దరికి పెళ్లి జరిపించారు. పెళ్లి జరుపుతున్న తంతును సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అంతటితో ఆగలేదు… ఈ దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో పార్క్‌లో ఏమి జరిగిందో తెలుగు రాష్ట్రాల్లోని జనాలందరికీ తెలిసిపోయింది.

తమ ప్రేమ వ్యవహారం, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు జరిపించిన పెళ్లి గురించి తెలుగు ప్రజలందరికీ తెలియడంతో ప్రేమజంట మనస్తాపానికిగురైంది. ఇళ్లకు వెళ్లడానికి ఆ ప్రేమికులు ఇబ్బందిపడ్డారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన లేక్‌ పోలీసులు ప్రేమజంటను రక్షించారు. ప్రేమికులిద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మరోవైపు తన కుమార్తె ఇంటికి రాలేదంటూ ప్రేమికురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్క్‌తో తన కుమార్తెకు పెళ్లి చేసినప్పటి నుంచి ఇంటికి రాలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు కారణం ఓ ఆరుగురంటూ.. వారి పేర్లు  పోలీసులకు ఇచ్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.