తక్కువ వడ్డీ అని ఆశ పడ్డారో, ష్యూరిటీ అవసరం లేదని టెంప్ట్ అయ్యారో తిప్పలు తప్పవు.. ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్ అప్పులు

online loan apps: మీరు విద్యార్థులా.. మీకు డబ్బులు అవసరం ఉన్నాయా..? మీకు కావాల్సిన డబ్బులు మేమిస్తామంటూ మీ మొబైల్స్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా..? తక్కువ వడ్డి, ష్యూరిటీలు అసలు అవసరం లేదని చెబుతున్నారా..? ఆఫర్ ఏదో బాగుంది కదా అని ఆ డబ్బు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే జరభద్రం. మీరు ఏ మాత్రం అనాలోచిత నిర్ణయం తీసుకున్నా..ఏకంగా మీ ప్రాణాలకే ప్రమాదం.
ఆన్‌లైన్‌లో అప్పులు.. తీసుకున్నారో తిప్పలే.. కొంపలు కూల్చుతున్న క్రెడిట్ యాప్స్.. ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్ రుణాలు.. విశాఖలో యువతి బలవన్మరణం..
అప్పు తీర్చడానికి పది నుంచి 15 రోజుల గడువు.. ఆ లోగా చెల్లించకపోతే బెదిరింపులు:
మీకు క్షణాల్లో అప్పు ఇచ్చి ఆపదలో ఆదుకుంటామంటూ నోటిఫికేషన్లు ఇస్తూ ప్రాణాలు తీస్తున్నాయి క్రెడిట్ యాప్స్. విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఫొటో, ఆధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్లే ష్యూరిటీగా మూడు వేల నుంచి 20 వేల వరకు రుణాలను అందిస్తున్నాయి ఈ యాప్స్. ఈ అప్పును పది నుంచి 15 రోజుల్లోనే తీర్చేయాలి. అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే అప్పటి నుంచి మొదలవుతాయి వేధింపులు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ.. యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈ వేధింపులు భరించ లేకే..విశాఖ జిల్లా గాజువాకలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
లోన్ కట్టడం చేతకాని నువ్వు బతకడం ఎందుకంటూ వాయిస్ మేసెజ్‌లు:
గాజువాక సుందరయ్య కాలనీకు చెందిన అహ్లాద…ఎంబీఏ పూర్తి చేసింది. లాక్‌డౌన్‌తో ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఇంటి అవసరాల కోసం ఆ అమ్మాయి..బబూల్ లోన్ అనే ఆన్‌లైన్ యాప్ నుంచి మొదట 7 వేలు తీసుకుంది. ఆ తరువాత మరి కొంత లోన్ తీసుకుంది. ఇలా దాదాపు 7 యాప్స్ నుంచి 40 వేలు డబ్బు అప్పుగా తీసుకుంది. అలా తీసుకున్న డబ్బు నవంబర్ 1న చెల్లించాల్సి ఉంది. కానీ ఆ రోజు డబ్బు లేకపోవడంతో…3వ తేదీకి వాయిదా వేసింది. అంతే ఆహ్లాద వాట్సాప్‌కు వరుసగా మేసెజ్‌లు..లోన్ కట్టడం చేతకాని నువ్వు బ్రతకడం ఎందుకంటూ వాయిస్ మేసెజ్‌లు..అంతేకాదు మీ ఫ్రెండ్స్‌కు సైతం మెసేజ్‌లు పంపుతామంటూ బెదిరింపులు..ఇలా నిత్యం టార్చర్ పెడుతుండంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది ఆ యువతి.
ఇన్‌స్టెంట్ లోన్ యాప్ పేరుతో యువతను ఉచ్చులోకి లాగుతున్నారు:
సైబర్ నేరగాళ్లు, ఆర్థిక మోసాలకు పాల్పడే నేరగాళ్లు ఆన్‌లైన్ క్రెడిట్ యాప్ అంటే ఇన్‌స్టెంట్ లోన్ యాప్ పేరుతో యువతను ఉచ్చులోకి లాగుతున్నారు. ఎక్కడో వుంటూ ఆన్‌లైన్‌లో కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ నేరగాళ్లు…గో క్యాష్, స్మాల్ వ్యాలెట్, బబుల్ లోన్, బిలియన్ క్యాష్, లోన్ బజార్ వంటి పేర్లతో వందలాది యాప్‌లను రూపొందించి గూగుల్ ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో ఎక్కువసేపు గడిపే వారికి ఆయా యాప్స్ లింక్‌లను పంపిస్తారు. వాటిని ఓపెన్ చేయగానే ఫొటో, ఆధార్ కార్డుతోపాటు సెల్‌ఫోన్‌లో గూగుల్ డ్రైవ్‌కు సింక్ అయిన కాంటాక్టు నంబర్లు తమకు మెయిల్ చేస్తే తక్షణం 3 వేలు నుంచి 20 వేలు వరకూ రుణం ఇస్తామంటారు.
అందరికీ విషయం చెబుతామంటూ బ్లాక్‌మెయిల్:
రుణంలో పది శాతం ప్రాసెసింగ్ చార్జీల కింద కోత విధించి మిగిలిన మొత్తాన్ని గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా పంపిస్తారు. రుణం తీర్చేందుకు 15 నుంచి 20 రోజులు మాత్రమే గడువు ఇస్తారు. గడువులోగా రుణం తీర్చకపోతే వారి తల్లిదండ్రుల నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా కాంటాక్టులోకి వెళ్లి మీ వాళ్లు మా దగ్గర రుణం తీసుకుని తిరిగి చెల్లించడం లేదు…కాబట్టి, మీరు ఆ మొత్తాన్ని చెల్లించాలి అంటూ ఒత్తిడి చేస్తారు. అప్పు తీర్చని పక్షంలో మీరు ఇచ్చిన ఫోన్ నంబర్‌లకు కాల్ చేసి…అందరికీ విషయం చెబుతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తారు.
ఈ ఆన్‌లైన్ అప్పుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో..చూశారుగా.. మీకు కూడా ఇలాంటి మేసెజ్‌లు వస్తున్నట్లైతే బీ..కేర్‌ఫుల్.