బెట్టింగ్ ముఠా అరెస్టు : రూ.5లక్షలు స్వాధీనం

నల్గొండ: ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడడమే కాకుండా ఆ పేరుతో ప్రజలను చీట్ చేస్తున్న ఓ ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. మిర్యాలగూడ కు చెందిన పుల్లారావు ఈ రాకెట్ లో కీలకపాత్ర పోషిస్తున్నారని జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ తెలిపారు. ఈ ముఠాలొ మొత్తం 10 మంది సభ్యులుండగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు వేముల పుల్లారావుతో పాటు గోలి శ్రినివాస్, బొరిగోర్ల కోటేశ్వరరావు, షేక్ ఇదయుతుల్లా, కనగంటి ఉపేందర్, కమటాల సుమన్ ఉన్నారు.
నిందితుల నుంచి రూ.5,18,500 రూపాయల నగదు, 15 సెల్ ఫోన్లు పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు షేక్ సాదిక్, శ్రీకాంత్ రెడ్డి, అనిల్, భగత్ పరారిలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. గేమింగ్ నిర్వహించే వాళ్ళతో పాటు ఆడేవారిని కూడా గుర్తించి కేసులు నమోదు చేస్తామని ప్రజలు ఇటువంటి వారి ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు.