Kondapochamma Sagar Dam Incident : పండుగ పూట పెను విషాదం.. కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో ఐదుగురు యువకులు గల్లంతు..

పండగ సెలవులు కావడంతో వారంతా సాగర్ ను దర్శించాలని వెళ్లారు.

Kondapochamma Sagar Dam Incident : పండుగ పూట పెను విషాదం.. కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో ఐదుగురు యువకులు గల్లంతు..

Updated On : January 11, 2025 / 6:34 PM IST

Kondapochamma Sagar Dam Incident : పండగ పూట సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. మృతులు హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. కొండపోచమ్మ సాగర్ లో యువకులు ఈతకు వెళ్లినట్లు తెలుస్తోంది.

సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ఘోరం జరిగిపోయింది..!
సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించడానికి హైదరాబాద్ నుంచి యువకులు వెళ్లారు. పండగ సెలవులు కావడంతో వారంతా సాగర్ ను దర్శించాలని వెళ్లారు. సాగర్ ను దర్శించాక అక్కడే పార్టీ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత సెల్ఫీల కోసం ప్రయత్నం చేశారు. యువకుల్లో ధనుష్ ఫోటోగ్రాఫర్ కావడంతో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఏడుగురు ప్రాజెక్ట్ లోకి దిగారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలు స్లిప్ కావడంతో ఒకరినొకరు లాక్కుని అందులో పడిపోయారని తెలుస్తోంది.

Also Read : మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు

తమ కళ్ల ముందే స్నేహితులు నీళ్లలో జారిపోయారని కంటతడి..
చనిపోయిన వారిలో ధనుష్ వయసు 25 ఏళ్లు. అతడు ఫోటోగ్రాఫర్. ఇక మిగతా వారంతా విద్యార్థులే. లోహిత్ (17), దినేశ్వర్ (17), సాహిల్ (19), జతిన్(17). మరో ఇద్దరు బతికి బయటపడ్డారు. జారిపోతున్న క్రమంలో ఆ ఇద్దరు రాళ్లు పట్టుకుని పైకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తమ కళ్ల ముందే స్నేహితులు జారి నీళ్లలో మునిగిపోయారని, నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేకపోయామని వారిద్దరూ కన్నీటిపర్యంతం అయ్యారు.

Kondapochamma Sagar Dam Tragedy

అసలేం జరిగింది? వివరాలు సేకరిస్తున్న పోలీసులు..
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో బతికి బయటపడ్డ ఇద్దరు విద్యార్థులతో పోలీసులు మాట్లాడుతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఆ ఇద్దరిని మీడియాతో మాట్లాడినివ్వలేదు పోలీసులు. ఏం జరిగింది అనే వివరాలు పూర్తిగా సేకరించిన తర్వాతే వారిని మీడియాతో మాట్లాడేందుకు అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది.

డ్యామ్ లో నీరు నిలిచిపోయి అక్కడ బాగా పాచి పట్టి ఉంటుంది. అక్కడ ఎవరూ కూడా దిగకూడదని సైన్ బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ యువకులు సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు.

సాహసాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత..
డ్యామ్ మొత్తం 9 కిలోమీటర్లు ఉంటుంది. ఒక ఎంట్రీ, ఒక ఎగ్జిట్ మాత్రమే ఉన్నాయి. అయితే డ్యామ్ దగ్గరికి వచ్చే యువకులు మొత్తం తిరుగుతూ ఉంటారు. గోడ దాటి రాళ్లు పట్టుకుని కిందకు దిగుతుంటారు. డ్యామ్ దగ్గర బందోబస్తుగా ఒకరిద్దరు పోలీసులే ఉంటారు. డ్యామ్ మొత్తం పర్యవేక్షించడం అంటే కుదరని పని. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, చర్యలు తీసుకున్నా కొందరు యువకులు అనవసరమైన సాహసాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.

 

Also Read : సంక్రాంతి పండుగ వేళ భారీ దందాకు తెరలేపిన ప్రైవేటు ట్రావెల్స్.. ప్రయాణికుల ఆందోళన