Private Travels: సంక్రాంతి పండుగ వేళ భారీ దందాకు తెరలేపిన ప్రైవేటు ట్రావెల్స్.. ప్రయాణికుల ఆందోళన
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణీకులకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు భారీగా ఛార్జీలు పెంచేసి దోపిడీ చేస్తున్నాయి.

Private Travels
Private Travels: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకునేందుకు జనం సొంతూళ్ల బాటపట్టారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకొనేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దందాకు తెరలేపాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణీకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సు ఛార్జీల ధరలను భారీగా పెంచేశాయి. పండుగకు వెళ్లాలనుకునే వారికి టికెట్ల రేట్లు చూస్తేనే గుండెదడ వచ్చేలా పెంచేశారు.
విశాఖపట్టణం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ వంటి ప్రముఖ నగరాలకు వెళ్లే ప్రాంతాల్లో టికెట్లు ధరలు చూస్తే కన్నీళ్లొస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు ఏసీ బస్సు ఛార్జీలు వెయ్యి నుంచి రూ.1800 వరకు ఉండేవి. ప్రస్తుతం పండుగ రద్దీని సొమ్ముచేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ. 4వేల నుంచి 5వేల వరకు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే మధ్యతరగతి ప్రజలు ఈ టికెట్ల రేట్లు చూసి జంకుతున్నారు.
ఒక్కో టికెట్ పై రెండు నుంచి మూడువేల వరకు ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే పండుగవేళ అంతేఉంటాయి అంటూ ప్రైవేట్ ట్రావెల్స్ బుకాయిస్తున్నాయి. ఇంత ధరలు పెట్టి జేబులు గుళ్లచేసుకొని సొంతగ్రామాలకు వెళ్లడం అవసరా అని ప్రయాణికులు పునరాలోచనలో పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ అయితే, రూ. 100 నుంచి 200 వరకు పెంచితే పర్వాలేదని, కానీ, రూ. 2వేల నుంచి 5వేల వరకు పెంచడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపైన ప్రభుత్వం స్పందించి టికెట్ ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. పండుగవేళ ప్రయాణికుల వద్ద అదనపు చార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బస్సులను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ దందాపై రవాణా శాఖ కొరడా ఝుళిపిస్తుంది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేయగా.. తాజాగా.. మరో పది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు అధికారులు. తెలంగాణలో ఎనిమిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేయగా.. విశాఖలో రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అధికార ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సంక్రాంతి పండుగకోసం నగర వాసులు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. శుక్రవారం నుంచే బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో రద్దీ నెలకొంది. పిల్లలకు పండగ సెలవులకు తోడు.. శని, ఆదివారాల సెలవులతో ఈ తాకిడి మరీ ఎక్కువగా ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి నల్గొండ, ఏపీవైపు వెళ్లే వాహనాలతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఆదివారం సాయంత్రం వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. పండగొచ్చిన ప్రతిసారీ ఈ సీన్లు మనకి కన్పిస్తూనే ఉంటాయ్. ఈసారి ఈ ఇబ్బంది కాస్తయిన తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు సంక్రాంతి పండుగకు టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. ఐతే వీటికి అదనంగా ఛార్జీలు వసూలు ఉంటుంది. మొత్తం 6432 బస్ సర్వీసులు నడుపుతుండగా.. జనవరి 15వ తేదీ వరకు అందుబాటులో ఉండటమే కాకుండా.. తిరుగు ప్రయాణాలకోసం జనవరి 18,19 వరకూ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. అయితే, అదనపు బాదుడుతో జనం జేబుకు చిల్లు పెట్టడంతో ప్రవేట్ బస్సులకు ఆర్టీసీ సర్వీసులకు తేడా లేకుండా పోయిందని కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎన్ని వేల బస్సులు నడిపినా ఒక్క బస్ కూడా ఖాళీ లేకపోవడంతో బస్ స్టాండ్స్ దగ్గర సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పడిగాపులు గాస్తున్నారు.