Sankranti Festival Rush : హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా పెరిగిన రద్దీ.. ఈ మార్గాల్లో వెళ్లితే తగ్గనున్న ట్రాపిక్ సమస్య
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది.

Hyderabad - Vijayawada highway
Sankranti Festival Rush : సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర వాసులు పల్లెబాట పట్టారు. విద్యా సంస్థలకు సెలవులు రావడంతో తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని తమ స్వగ్రామాలకు పయణమవుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కూకట్ పల్లి, ఎల్బీ నగర్ ప్రధాన కూడళ్లలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు వచ్చిన వారితో రద్దీగా మారాయి.
Also Read: Sankranti Festival Rush : టోల్ గేట్ల దగ్గర బారులు తీరిన వాహనాలు.. పండక్కి పల్లెకు పయనమైన పట్టణం
హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద 10 టోల్ బూత్ ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వాహనాలను పంపిస్తున్న సిబ్బంది.. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను ఆరు గేట్ల ద్వారా పంపిస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ మరింత పెరిగింది. చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) రద్దీ మరింత పెరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి గుంటూరు, నెల్లూరువైపు వెళ్లే ప్రయాణికులు కొంతదూరం పెరిగినా హైదరాబాద్ – నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్లి.. ఓఆర్ఆర్ పైకి వెళ్లి బొంగులూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జున సాగర్ హైవేలోకి వెళితే ట్రాఫిక్ సమస్య నుంచి కాస్తయిన బయటపడవచ్చునని పోలీసులు సూచించారు. అదేవిధంగా.. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణీకులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కట్ పల్లి దాటితే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి ఘట్ కేసర్ లో ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేపైకి వెళ్లొచ్చు. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరి వెళ్లొచ్చు.
హైదరాబాద్ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా బైపాస్ మీదుగా రెండు వైపులా రాకపోకలకు అనుతిచ్చారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు సమయం ఆదాకానుంది.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు..
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. చర్లపల్లి – విశాఖపట్టణం మధ్య జనసాధారణ్ రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లి నుంచి విశాఖకు ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లిలో ఉదయం 10గంటకు బయలుదేరి అదేరోజు రాత్రి 10.30గంటకు విశాఖ చేరుకుంటాయి. విశాఖ నుంచి చర్లపల్లికి ఈనెల 10, 12, 15, 17 తేదీల్లో రైళ్లు నడపనున్నారు. విశాఖలో సాయంత్రం 6.20 గంటలకు బయటుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పండుగ సందర్భంగా 26 అదనపు రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈనెల 17వరకు అదనపు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. సికింద్రాబాద్, బెంగళూరు మధ్య అదనపు రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
26 Additional #Sankranti Special Trains between various Destinations pic.twitter.com/fjMAKhIn12
— South Central Railway (@SCRailwayIndia) January 9, 2025