ముహూర్తానికి కొద్ది నిమిషాల ముందు పెళ్ళి కొడుకు…

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవాల్సిన వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
ఆదివారం(నవంబర్ 10,2019) ఉదయం 11.30 గంటలకు ముహూర్తం నిశ్చయించుకున్నారు. కొంపల్లి చౌరస్తాలోని శ్రీకన్వెన్షన్ హాల్ కళ్యాణ వేదికకు పెళ్లివారు చేరుకున్నారు. బంధుమిత్రపరివారంతో ఫంక్షన్ హాల్ మొత్తం కళకళలాడుతోంది. పచ్చటి పందిరి, మేళతాళాలు, అతిథులతో ఆ ప్రాంగణంలో ఎటు చూసినా సందడే. కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా వరుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెళ్లి కొడుకు వాళ్లది దిల్‌సుఖ్‌నగర్. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో పెళ్లి కావాల్సిన వరుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో.. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.