చైన్ స్నాచర్ ని పట్టించిన మహిళ
ధైర్యంతో దొంగను పట్టుకున్న మహిళ

ధైర్యంతో దొంగను పట్టుకున్న మహిళ
హైదరాబాద్ : నగరంలో చైన్ స్నాచర్స్ మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇంతవరుకు రోడ్డుమీద వెళుతున్న మహిళల మెడలోంచి గొలుసులు లాక్కెళ్లే దొంగలు ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి జొరబడి మహిళ మెడలోంచి చెయిన్ దొంగి లించే ప్రయత్నం చేస్తున్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వికాస్ నగర్ కాలనీలోని ఓఅపార్ట్ మెంట్లోని మహిళ మెడలోంచి చైన్ దొంగిలించ బోయి అడ్డంగా బుక్కయి పోలీసులకు చిక్కాడు ఓ చైన్ స్నాచర్.
వివరాల్లోకి వెళితే వికాస్ నగర్ కాలనీలోని ధరణి అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే విజయలక్ష్మి అనే మహిళ తన అపార్ట్మెంట్లో తిరుగుతుండగా గోడదూకి వచ్చిన దొంగ ఆమె నోరు నొక్కి, మెడలో గొలుసు తెంచుకుపోబోయాడు. తీవ్రంగా ప్రతి ఘటించిన మహిళ దొంగను గట్టిగా పట్టుకుని, అరవటంతో ఇంట్లోని ఆమె భర్త,కుమారుడు బయటకు వచ్చి దొంగను పట్టుకుని దేహశుధ్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దొంగను అదుపులోకితీసుకున్న పోలీసులు చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి అతడ్ని విచారిస్తున్నారు.