మాయగాళ్లు: సిమ్ స్వాపింగ్ ద్వారా బ్యాంకులో డబ్బులు ఖాళీ

  • Published By: chvmurthy ,Published On : January 20, 2019 / 09:00 AM IST
మాయగాళ్లు: సిమ్ స్వాపింగ్ ద్వారా బ్యాంకులో డబ్బులు ఖాళీ

హైదరాబాద్: సిమ్ స్వాపింగ్ ద్వారా బ్యాంకు ఎకౌంట్లో డబ్బులు కాజేసే నైజీరియన్ ముఠాను  సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.  ఫిషింగ్ మెయిల్స్ చేసి, కంపెనీ వివరాలు, ఫోన్ నెంబరు తెలుసుకుని వాటి ద్వారా సిమ్ స్వాప్ చేసి కంపెనీల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టిందీ ముఠా.  కొల్ కత్తా కేంద్రంగా  నేరాలు చేస్తున్న ముఠాను ట్రాన్సిట్ వారంట్ పై  నగర పోలీసులు శనివారం హైదరాబాద్ తీసుకు వచ్చారు.సైబరాబాద్ పోలీసు కమీషనర్ వీసీ గుజ్జనార్ తెలిపిన వివరాలప్రకారం
నైజీరియాకు చెందిన ఎబిగో ఇన్నోసెంట్‌ @ జేమ్స్‌ కోల్‌కతాలో ఉన్నసమయంలో ఫుట్‌బాల్‌ ఆడేందుకు వచ్చిన మరో నైజీరియన్ ఒడాఫీ హెన్రీ పరిచయమయ్యాడు. వీరిద్దరూ కలిసి స్విమ్ స్వాపింగ్  ద్వారా మోసాలు చేయటం మొదలెట్టారు. వీరికి కొల్ కత్తాలో, మనీ ట్రాన్సఫర్ కి నకిలీ వివరాలతో బ్యాంకు ఎకౌంట్లు తెరిచే సంతోష్ బెనర్జీ, డూప్లికేట్ సిమ్ కార్డులు సమకూర్చే రాజత్ కుందులు పరిచయం అయ్యారు. అనంతరం నైజీరియా వెళ్లిపోయిన ఇన్నోసెంట్, భారత్ లోని కంపెనీలకు ఫిషింగ్ ఈ మెయిల్స్ పంపి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల వివరాలు,రిజిష్టర్డు మొబైల్ నెంబరు, కంపెనీ పేరు చిరునామాలు సేకరించి కొల్ కత్తాలోని హెన్రీ, రాజత్‌ కుందు, సంతోశ్‌ బెనర్జీలకు పంపేవాడు. వీరు ముగ్గురు వెంటనే  రిజిష్టర్డ్ మొబైల్ నెంబరుకు డూప్లికేట్  సిమ్ కార్డు తీసుకుని దాని ద్వారా ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసేసుకునేవారు. 
ముఠా సభ్యులు ఈ ప్రక్రియ అంతా శని, ఆదివారాల్లో చేసేవారు. ఈలోపు వివిధ ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేసి వాటితో బంగారం, బట్టలు కొని నైజీరియా పంపించేవారు. గత డిసెంబర్ లో హైదరాబాద్ లోని  ఎలిమ్‌ కెమికల్స్, షాలోమ్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఖాతాల నుంచి రూ. తొమ్మిది లక్షలు ఖాళీ కావడంతో వాటి యజమానులు 2018  డిసెంబర్17 న  ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు  చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు విచారణ జరిపి, సెల్ ఫోన్ నంబర్ల లొకేషన్ ఆధారంగా కొల్ కత్తాలో ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 17 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు పాస్‌పోర్టులు, డెబిట్‌కార్డులు, ఆధార్‌కార్డులు, లామినేషన్‌ మెషీన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
వీరు చెన్నై,కోల్‌కతా,అహ్మదాబాద్, ఢిల్లీలోని 11  కంపెనీల నుంచి 33లక్షల రూపాయలు మోసం చేసినట్టు  విచారణలో తేలింది. కాగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఎబిగో ఇన్నోసెంట్‌ను పట్టుకునేందుకు నైజీరియాకు లేఖ రాస్తామని, వెరిఫికేషన్‌ లేకుండా సిమ్‌ జారీ చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు.