OMG : హైదరాబాద్‌లో కాంబ్లె ముఠా.. వీళ్ల టార్గెట్ మగాళ్లే

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 04:20 AM IST
OMG : హైదరాబాద్‌లో కాంబ్లె ముఠా.. వీళ్ల టార్గెట్ మగాళ్లే

Updated On : March 4, 2019 / 4:20 AM IST

హైదరాబాద్‌: నగరంలో మరో కొత్త ముఠా రంగంలోకి దిగింది. వాళ్ల టార్గెట్ మగాళ్లు మాత్రమే. పురుషుల మెడల్లోని గొలుసులు ఇట్టే కొట్టేస్తారు. అదే కాంబ్లె ముఠా. ఇప్పుడీ గ్యాంగ్ పేరు వింటే హైదరాబాద్ లో ఉండే మగాళ్లలో వణుకుపడుతోంది.

ముందుగా ఈ గ్యాంగ్ లోని ఐదుగురు బస్సులెక్కుతారు. ఏ పురుషుడి మెడలో గొలుసు ఉందో గమనిస్తారు. ముఖ్యంగా ఫుట్‌బోర్డుపై ఉన్నవారి మెడలోని గొలుసులపై కన్నేస్తారు. ఆ వ్యక్తి ముందు ముగ్గురు..వెనుక ఇద్దరు నిల్చుంటారు. మధ్యలో ఉన్న వ్యక్తిని ఒత్తిడికి గురి చేసి..అతను ఏమరుపాటుగా ఉండగా..బస్సు సడెన్ బ్రేక్స్ వేసే సమయంలో గురిచూసి గొలుసును లాగేస్తారు. పని కాగానే నెక్ట్స్ బస్టాప్‌లో అయిదుగురూ దిగేస్తారు.
 
ఇటువంటి కంప్లైంట్స్ ఇటీవల కాలంలో ఎక్కువ కావటంతో పోలీసులు వారిపై దృష్టి పెట్టారు. బాధితుల వివరాల ప్రకారం పోలికలు రాబట్టారు. పాత నేరస్థుల ఫొటోలు తీయించి బస్టాండ్లలో పెట్టి ప్రచారం చేశారు. దీంతో మార్చి 2 సాయంత్రం లక్డీకాపూల్‌లోని బస్టాప్‌లో అనుమానితుల్ని గుర్తించారు. వారితోపాటు పోలీసులూ బస్సెక్కారు. ఈ క్రమంలో సైఫాబాద్‌ సీఎస్ ఎదుట బస్సును ఆపి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ‘కాంబ్లె శ్యామ్‌సుందర్‌ గ్యాంగ్‌’గా చలామణీ అవుతూ 8 చోరీలు చేసినట్లు తేలింది. 2 నెలలుగా ఇలా చోరీలు చేస్తున్నారని తెలిపారు. వారి నుంచి 70 గ్రాములు బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
వీరంతా ఒకే బస్తీకి చెందినవారు.

మల్లేపల్లిలోని అఫ్జల్‌సాగర్‌ (మంగార్‌బస్తీ)కు చెందినదిగా గుర్తించారు. కాంబ్లె శ్యామ్‌సుందర్‌ అలియాస్‌ శ్యామ్‌ (24), కాంబ్లె దశరథ్‌ అలియాస్‌ రాజు (27), కాంబ్లె లక్కీ (20), బి.సాయికుమార్‌ (19), అరుణ్‌ రాజ్‌ గీతా భరత్‌ (19) ఈ ముఠాలో సభ్యులు. మరో నలుగురు పరారీలో ఉన్నారని అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాంబ్లె శ్యామ్‌సుందర్‌ పాత నేరస్థుడు. ఇతనిపై గతంలో 22 కేసులున్నాయి. పీడీ చట్టం ఏడాది జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక 10 మందితో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.