సిమ్ బ్లాకయిందా? డబ్బు గోవిందా!!

ఆన్‌ లైన్‌ మోసాలకు పాల్పడ్డవారు ఇప్పుడు సిమ్‌ స్వాపింగ్‌కు పాల్పడుతూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 20, 2019 / 03:13 PM IST
సిమ్ బ్లాకయిందా? డబ్బు గోవిందా!!

Updated On : January 20, 2019 / 3:13 PM IST

ఆన్‌ లైన్‌ మోసాలకు పాల్పడ్డవారు ఇప్పుడు సిమ్‌ స్వాపింగ్‌కు పాల్పడుతూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు.

హైదరాబాద్ : ఉన్నట్టుండి మీ సిమ్‌ కార్డ్‌ బ్లాక్‌ అయిందా.. అయితే మీ ఖాతాలోని డబ్బు గోవిందా..  అవును నిజం.. సైబర్‌ నేరగాళ్లు టెక్నాలజీని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రజల డబ్బును దోచుకుంటున్నారు. మీ సిమ్‌ బ్లాక్‌ అయిందా.. ఆ ఏముందిలే రేపో.. ఎల్లుండో కంపెనీకి వెళదామని లైట్‌ తీసుకున్నారా.. అయితే మీ ఖాతాలో డబ్బు ఖాళీ అయిపోతుంది. విడతల వారీగా డబ్బంతా మాయమవుతుంది.  మిమ్మల్ని బికారిని చేస్తుంది. టెక్నాలజీని విచ్చలవిడిగా వినియోగించుకుంటూ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మొన్నటిదాకా ఆన్‌ లైన్‌ మోసాలకు పాల్పడ్డవారు ఇప్పుడు సిమ్‌ స్వాపింగ్‌కు పాల్పడుతూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు.

హైదరాబాద్ చింతల్‌కు చెందిన పంతం వెంకటకృష్ణ .. ఎలిమ్, షాలోమ్ కెమికల్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్నారు. డిసెంబరు 15న  రాత్రి అతని ఫోన్ నంబరు డిస్‌కనెక్ట్ అయ్యింది. అయితే వీకెండ్‌ కదా  అని లైట్‌ తీసుకున్నఅతనికి షాక్‌ తగిలింది. ఇండస్ట్రీ బ్యాంక్ ఖాతాల నుంచి 9 లక్షలు డ్రా అయినట్టు  గుర్తించి.. ఆయన ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి డిస్‌కనెక్ట్‌ చేయాలని ఫిర్యాదు చేశారు. తన పేరున గుర్తుతెలియని వ్యక్తులు కొత్త సిమ్ తీసుకొన్నట్టు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు.  దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ మోసానికి పాల్పడింది నైజీరియాలో ఉంటున్న ఎబిగ్‌బో ఇన్నోసెంట్ అని తేల్చారు.  

నైజీరియన్లు క్రైమ్‌కు పాల్పడ్డ తీరు పోలీసులకే షాకిచ్చింది. మన ప్రమేయం లేకుండానే బ్యాంక్ లోని డబ్బు కొద్దికొద్దిగా మాయమవుతుంది…మన ప్రమేయం లేకుండా అపరిచితులు మన పేరుపై రిజిస్టర్ అయిన నెంబర్ తో డూప్లికేట్ సిమ్ కార్డు పొంది  బ్యాంక్ లావాదేవీలు జరుపుతారు. దీనిని సిమ్ కార్డు స్వాపింగ్ అంటారు. వీటికి ప్రధాన కారణం ఇంటర్ నెట్‌లో బ్రౌజ్ చేయడం..నెట్ వాడే క్రమంలోనే తెలియని కొత్త సైట్లను ఓపెన్ చేయడంతో  మనకు తెలీకుండానే… మాల్ వేర్  అటాక్, లేదా స్వైవేర్ అటాక్ చేరడంతో పర్సనల్ డేటాను దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ సైబర్‌ దొంగలు మరో పద్ధతిలోనూ నెట్టింట్లోకి ఎంటర్ అయిపోతున్నారు. మన మెయిల్స్‌కు  వచ్చే ఫిషింగ్ మెయిల్స్‌లో కూడా  సైబర్ నేరగాళ్లు డేటాను లాగేస్తారు. అంటే మెయిల్స్‌కు  వచ్చే లాటరీ లేదా .. బ్యాంక్ సంబంధిత మెయిల్  కానీ ..నో రిప్లై మెయిల్స్ లాంటివి వచ్చినపుడు మన డేటా లూటీ అయిపోతుంది .

ఈ ముఠా  తెలంగాణతో పాటు 11ప్రాంతాల్లో మోసాలకు పాల్పడింది. 13కంపెనీలకు చెందిన బ్యాంక్ ఖాతాల నుంచి లక్షల రూపాయల సొమ్మును కాజేశారు. వీళ్లలో  ఎబిగ్‌బో ఇన్నోసెంట్ పరారీలో ఉండగా… ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 మొబైల్స్, ల్యాప్‌టాప్, పాసుపోర్టు, రబ్బర్ స్టాంప్‌లు, చెక్‌బుక్‌లు, డెబిట్, ఆధార్, పాన్‌కార్డులు, లామినేషన్ మెషిన్లను స్వాధీనం చేసుకొన్నారు. వివిధ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్లలోని లొసుగుల ద్వారా వీరు నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి నేరాల భారినపడకుండా ఉండాలంటే సెల్‌ఫోన్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండమే ఉత్తమమైన మార్గం  అంటున్నారు  పోలీసులు.  ఎవరి సిమ్‌కార్డ్‌ అయినా బ్లాక్‌ అయితే వెంటనే బ్యాంకులను సంప్రదించి క్రెడిట్, డెబిట్ కార్డులనే కాకుండా ఆ ఖాతాలనే బ్లాక్ చేయించాలని సూచిస్తున్నారు.