Cyber Crime: ఘరానా సైబర్ మోసం.. అమ్మాయి ఫోటోలతో హైదరాబాద్ డాక్టర్ ట్రాప్.. రూ.14 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

కాంబోడియా నుంచి డాక్టర్ ని ట్రాప్ చేసి మోసం చేసినట్లు గుర్తించారు.

Cyber Crime: ఘరానా సైబర్ మోసం.. అమ్మాయి ఫోటోలతో హైదరాబాద్ డాక్టర్ ట్రాప్.. రూ.14 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Updated On : December 21, 2025 / 12:42 AM IST

Cyber Crime: సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా అందమైన అమ్మాయి ఫోటోలను ఎరగా వేసి ఓ డాక్టర్ ని ట్రాప్ చేసి అతడి నుంచి 14 కోట్లు కొట్టేసిన వైనం సంచలనంగా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక డాక్టర్ సైబర్ మోసానికి గురయ్యాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్ ని బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు. ముందుగా అందమైన అమ్మాయి ఫోటోలతో డాక్టర్ కి ఎర వేశారు. ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టి ట్రాప్ చేశారు. అందమైన అమ్మాయి ఫోటో చూసి డాక్టర్ టెంప్ట్ అయ్యాడో మరో కారణమో కానీ.. చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు.

తాను ఒంటరి మహిళనని, కంపెనీలో పని చేస్తానని లేడీ పరిచయం చేసుకుంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. ఆ లేడీ ట్రాప్ లో పడిన డాక్టర్… ఆమెను నమ్ముకుని తన ఇంటిని అమ్మేశాడు. అలా వచ్చిన 14 కోట్ల రూపాయలు ఆమె అకౌంట్ కు పంపాడు. ఆ తర్వాత తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబోమన్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. డాక్టర్ ని మోసం చేసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు.

కాంబోడియా నుంచి డాక్టర్ ని ట్రాప్ చేసి మోసం చేసినట్లు గుర్తించారు. కాంబోడియాలో తిష్ట వేసిన చైనీయులే ఈ క్రైమ్ వెనుక ఉన్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకులను తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు తెలిపారు. మన దేశం వాళ్లతోనే సైబర్ నేరాలు చేయిస్తున్నారు. కంబోడియాలో ఉన్న సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ ఇచ్చిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యూల్ అకౌంట్ లోకి వచ్చిన డబ్బును వివిధ మార్గాల ద్వారా కంబోడియాకి తరలించారు.