హాస్టల్‌లో దెయ్యం : కనిపెట్టిన విద్యార్థినులు
అర్ధరాత్రి.. ఆ హాస్టల్‌లో దెయ్యం తలుపు తడుతుంది. వింత శబ్దాలు చేస్తుంది.

అర్ధరాత్రి.. ఆ హాస్టల్‌లో దెయ్యం తలుపు తడుతుంది. వింత శబ్దాలు చేస్తుంది.
మహబూబ్ నగర్ : అర్ధరాత్రి.. శ్మశాన నిశబ్దం.. ఎవరో డోర్ కొడుతున్న శబ్దం.. వింత అరుపులు.. బాబోయ్ దెయ్యం అంటూ కేకలు.. .. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కస్తూర్బా హాస్టల్ విద్యార్థులు.. ఇంతకూ నిజంగా ఆ హాస్టల్‌లో దెయ్యం ఉందా?
అర్ధరాత్రి.. ఆ హాస్టల్‌లో దెయ్యం తలుపు తడుతుంది. వింత శబ్దాలు చేస్తుంది. ఆ దెయ్యమే నిమ్మకాయ తెచ్చి కోస్తుంది.. డోర్ ముందు పసుపు, కుంకుమ చల్లుతుంది. ఆ దెయ్యానికి తోడు.. ఇంకో దెయ్యం ఉంటుంది. హాహాకారాలు చేస్తుంది.
ఇది మహబూబ్‌నగర్ జిల్లా మగనూరులోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్. తల్లిదండ్రులకు దూరంగా ఈ స్కూలు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న బాలికలను క్షుద్రపూజల ఆనవాళ్లు, దెయ్యాల అరుపులు, భూతప్రేత పిశాచాల కేకలు భయపెడుతున్నాయి. అయితే ఆ దెయ్యాలెవరో విద్యార్థినులు కనిపెట్టారు.
గత రెండు, మూడు రోజుల నుంచి అర్ధరాత్రి సమయంలో ఎవరో తలుపు కొడుతున్న శబ్దం రావడంతో భయపడ్డామని విద్యార్థినులు చెబుతున్నారు. చివరికి ధైర్యంతో తలుపులు తీయడంతో అసలు విషయం తెలిసిందని అంటున్నారు. ప్రిన్సిపల్ జ్ఞానేశ్వరితో పాటు అటెండర్ మాధవి కలిసి… ఓ రోజు తమ గదుల చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వేశారని చెబుతున్నారు. అయితే ఘటనకు ముందు రెండు రోజులు పాటు సెలవులు పెట్టిన ఆమె…ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి ఒంటి గంటకు పాఠశాలకు వచ్చిందని.. విద్యార్థినులు చెబుతున్నారు.
దెయ్యాల్లాగా శబ్దాలు చేసేవారెవరో కనిపెట్టిన విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి క్షుద్రపూజలపై ఆరా తీశారు. పోలీసులు, విద్య, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులని తేలినవారిపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. అటు హాస్టల్ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థినుల ఆరోపణలు నిజమైతే ప్రిన్సిపల్, అటెండర్‌ను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.