కమిటీ ఏర్పాటుతో కలకలం : బాసర అమ్మవారి వజ్రం ఏమైందీ!

  • Published By: chvmurthy ,Published On : May 6, 2019 / 09:41 AM IST
కమిటీ ఏర్పాటుతో కలకలం : బాసర అమ్మవారి వజ్రం ఏమైందీ!

Updated On : May 6, 2019 / 9:41 AM IST

బాసర : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి మూలవిరాట్ పైనున్న మకుటంలోని ఒక వజ్రం మాయమైంది. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ వజ్రాలు పొదిగిన మకుటంతో దేదీప్యమానంగా వెలిగిపోవాల్సిన అమ్మవారు.. అధికారులు, పూజారుల నిర్లక్ష్యంతో బోసిపోయింది. అమ్మవారికి రోజువారీగా అలంకరించే కిరీటంలో ఓ వజ్రం కొన్నిరోజుల నుంచి కనపడకుండా పోయింది. అయినప్పటికీ ఇక్కడి పూజారులు అధికారులు వజ్రం గురించి పట్టించుకోవడం మర్చిపోయారు.

ఏటా కోట్లలో ఆదాయం వస్తున్నా.. అమ్మవారి మూలవిరాట్‌కు ఓ వజ్రాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు అధికారులు. పైగా పూజారులు రోజు వారీగా అభిషేకం చేస్తున్న సమయంలో ఎక్కడో పడి పోయిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. కొన్నిరోజుల నుంచి వజ్రం లేని కిరీటాన్నే అమ్మవారికి అలంకరిస్తున్నారు. తరచూ బాసర ఆలయంలో వివాదాలు ఏర్పడుతున్నా.. ఇక్కడి అధికారులు, పూజారుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు.

బాసర అమ్మవారి గుళ్లో గతంలో కూడా 2,3 సార్లు అపచారం జరిగింది. ఒకసారి అమ్మవారి విగ్రహాలను దేవరకొండకు తరలించారు. మరోక సారి అమ్మవారి ముక్కుపుడుక మాయం కావటం జరిగింది. ఆసమయంలో సంబంధిత ఉద్యోగులపై  చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అమ్మవారి కిరీటంలో వజ్రం కనపడకుండా పోయింది. అయితే అది 2013 లోనే పోయిందని పూజారులు నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారు. ఇన్ని రోజులుగా ఈ విషయం గోప్యంగా ఉంచారు. ఈ విషయం 2 రోజుల క్రితం  మళ్లీ చర్చకు రావటం జరిగింది. దీనిపై  ప్రస్తుతం ఆలయంలో విచారణ జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రి ఇందకరణ్ రెడ్డి ఒక విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ తన నివేదికను 2 రోజుల్లో సమర్పిస్తుంది. వజ్రాన్ని ఎవరైనా దొంగిలించారా లేక ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగేటప్పుడు జారి పడిపోయిందా అనేది తేలాల్సి ఉంది.