సిమ్ కార్డ్ బ్లాక్ అంటూ మెసేజ్ వచ్చిందా? అయితే.. సైబర్ నేరగాళ్ల పనే!

సైబర్ నేరాల్లో ఎక్కువగా బ్యాంకింగ్, కేవైసీ తరహా మోసాలే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయ్. ఓటీపీలు చెప్పాలంటూ.. QR కోడ్‌లు పంపాలంటూ.. ఈ-కేవైసీలంటూ.. రకరకాలుగా మోసం చేస్తున్నారు. జస్ట్.. సిమ్ స్వాప్‌తోనే లక్షలు కొట్టేస్తున్నారంటే.. సైబర్ నేరగాళ్లు ఎంతగా ఆరితేరారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ.. ఆ కంత్రీగాళ్లు మనల్ని ఎలా మోసం చేస్తారో.. ఈ రిపోర్ట్‌లో చూడండి.
కొత్త పద్ధతుల్లో హైటెక్ దోపిడీ :
రోజురోజుకు.. స్మార్ట్ అయిపోతున్న సైబర్ నేరగాళ్లు.. కొత్త కొత్త పద్ధతుల్లో జనాన్ని మోసం చేసేస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా.. అకౌంట్‌లో క్యాష్‌ని కాజేస్తున్నారు. గడచిన కొద్ది రోజుల్లోనే.. ఈ తరహా మోసాలతో.. 60 లక్షల దాకా కాజేశారు కంత్రీగాళ్లు. ఇప్పటి వరకు సైబర్ క్రైమ్స్ అనగానే.. కేవలం ఓటీపీలు, డెబిట్, క్రెడిట్ కార్డుల ఫ్రాడ్స్ మాత్రమే గుర్తుకొస్తాయ్.
కానీ.. కొత్తగా ఈ-కేవైసీ, సిమ్ కార్డ్ అప్‌డేషన్, ఆధార్ లింక్ అంటూ.. అమాయకులకు వల వేసి.. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. లాక్‌డౌన్‌లో ఈ తరహా మోసాలు అధికమయ్యాయి. కస్టమర్ల బ్యాంక్ వివరాలు తెలుసుకొని.. ఓటీపీలు చెప్పగానే అందులో నుంచి డబ్బును కాజేస్తున్నారు. ఆలస్యంగా తేరుకొని.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.
పేటీఎం కేవైసీని రిజిస్టర్ చేసుకోవాలని, డెబిట్, క్రెడిట్ కార్డులు అందజేస్తామని చెబుతూ.. మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. బ్యాంక్ అధికారులమని కాల్ చేసి.. డెబిడ్, క్రెడిట్ కార్డుల వివరాలు అడుగుతున్నారు. లేకపోతే.. కార్డు బ్లాక్ అవుతుందని చెబుతున్నారు. ఓటీపీలు కనుక్కుంటూ.. ఖాతాలో ఉన్న మొత్తాన్ని దోచేస్తున్నారు. ఈ మధ్యే పోలీసులు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, జలంధర్, ఢిల్లీకి చెందిన కంత్రీగాళ్లను అరెస్ట్ చేశారు.
హ్యాక్ చేసిన ఫోన్ నెంబర్లే టార్గెట్ :
కొత్తగా మరో లూటీకి ప్లాన్ చేశారు కేటుగాళ్లు. హ్యాక్ చేసిన మొబైల్ ఫోన్ నంబర్లను టార్గెట్ చేశారు. పక్కా స్కెచ్ వేసి సిమ్ కార్డ్ నెట్ వర్క్ ను బ్లాక్ చేస్తున్నారు. ఆ తర్వాత సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నామంటూ.. బ్యాంక్ అకౌంట్లలో సొమ్మును కాజేస్తున్నారు. తాము సేకరించిన నెంబర్ల మొబైల్ నెట్ వర్క్ ముందుగా జీరో లెవల్ కి తీసుకొస్తారు.
నెట్ వర్క్ ఫెయిలయ్యాక.. కస్టమర్ కేర్ పేరుతో కాల్ చేస్తారు. లిఫ్ట్ చేయగానే.. కూడా మీ మొబైల్ నెట్ వర్క్ లో ప్రాబ్లం ఉందని నమ్మిస్తారు. కస్టమర్ కూడా వివరాలన్నీ చెప్పేస్తాడు. దీనిని క్యాష్ చేసుకొని.. ముందు కీప్యాడ్‌లోని నెంబర్ 1ని నొక్కమని చెబుతారు. ప్రెస్ చేయగానే.. మొబైల్ నెట్ వర్క్ పడిపోతుంది. ఆ టైంలోనే.. ఒక మాల్‌వేర్‌ని మొబైల్‌కి పంపిస్తారు. అది.. ఫోన్‌లో ఉన్న డేటా, ఓటీపీలను సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. ఆ ఫోన్ నెంబర్‌తో ఉన్న బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న సొమ్ము మొత్తాన్ని..
చాలా ఈజీగా కొట్టేస్తున్నారు.
సిమ్ స్వాప్ తో జాగ్రత్త :
సిమ్ స్వాప్ అనే సైబర్ క్రైమ్‌తో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లో ఇలాగే ముగ్గురి నుంచి క్యాష్ కొట్టేశారు. మియాపూర్ కి చెందిన అప్పలనాయుడుకి.. త్వరలోనే మీ సిమ్ కార్డ్ బ్లాక్ టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి.. కస్టమర్ కేర్ పేరుతో సైబర్ కేటుగాళ్ల నుంచి కాల్ వచ్చింది. కేవైసీ కోసం వివరాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. నిజమేనని నమ్మి.. ఆధార్, బ్యాంక్ వివరాలన్నీ ఇచ్చేశాడు. అంతే.. అకౌంట్‌లో ఉన్న 9 లక్షల 20 వేల నగదును కొట్టేశారు.
గచ్చిబౌలికి చెందిన కుమార్ కౌశల్ కిషోర్ మిశ్రాకు.. త్వరలోనే మీ ఫోన్ నెంబర్ బ్లాక్ అవబోతోందని ఓ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. కేవైసీ అప్‌డేట్ చేస్తే.. యాక్టివేట్‌లోనే ఉంటుందనేది దాని సారాంశం. కంగారుపడి.. వెంటనే కస్టమర్ కేర్ నెంబర్ 121కి కాల్ చేశాడు. కానీ.. అప్పటికే సైబర్ నేరగాళ్లు అతని మొబైల్‌ని ట్రాప్ చేసేశారు. కాల్ చేయగానే.. వాళ్లే మాట్లాడారు. అన్ని వివరాలు సమర్పించాక.. బ్యాంకు ఖాతా నుంచి 6 లక్షలు యమైపోయాయ్. ఇలాగే.. గచ్చిబౌలికి చెందిన సురేష్ రామన్ కూడా సైబర్ క్రిమినల్స్ బారిన పడి 3 లక్షల 70 వేలు, డి.శ్రీనివాస్ అనే మరో బాధితుడు దగ్గర్నుంచి లక్ష రూపాయలు కొట్టేశారు.
ఓటీపీ, పిన్ ఎవరికీ షేర్ చేయొద్దు :
ఢిల్లీలో జరిగిన ఇలాంటి క్రైమ్ కేసులను మన సైబర్ క్రైమ్ పోలీసులు స్టడీ చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి ఫేక్ కాల్స్ ఎలా వస్తాయ్.. బ్యాంక్ అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తారన్న దానిపై.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫోన్ నెట్‌వర్క్ ఫెయిలైనా.. కస్టమర్ కేర్ పేరుతో కాల్ వస్తే స్పందించకపోవడమే బెటర్ అంటున్నారు పోలీసులు. ఆర్బీఐ కూడా బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.
ఐడెంటిటీ థెఫ్ట్ లాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓటీపీ, యూపీఐ పిన్ వివరాలను ఎవరికీ షేర్ చేయొద్దని హెచ్చరించింది. ఆ వివరాలతో వర్చువల్ పేమెంట్ అకౌంట్ క్రియేట్ చేసి.. డబ్బులు కాజేసే అవకాశముందని ఆర్బీఐ తెలిపింది. నమ్మకమైన ఈ-కామర్స్ వెబ్ సైట్లలో మాత్రమే షాపింగ్ చేయాలనీ సూచించింది. పబ్లిక్ ప్లేసుల్లో చార్జింగ్ పెట్టుకోవద్దని తెలిపింది. అలాగే.. పబ్లిక్ వైఫై ఉపయోగిస్తే.. వీపీఎన్ నెట్‌వర్క్ ఉపయోగించాలని సూచించింది.