బిగ్ బ్రేకింగ్ న్యూస్ : దిశా నిందితుల ఎన్ కౌంటర్

దిశా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశాను ఎక్కడ చంపారో అక్కడే ఎన్ కౌంటర్ చేశారు. చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులు పారిపోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీపీ సజ్జనార్ అధికారికంగా నిర్ధారించారు.
దేశ వ్యాప్తంగా దిశపై హత్యాచారం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఘటన అనంతరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి దాటాకా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి పోలీసులు ఘటనా స్థలానికి రహస్యంగా తరలించారు.
తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతంలో నిందితులు లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలించారు. నిందితులు భూమిలో పాతిపెట్టిన దిశ మొబైల్‌ను వారితోనే వెలికి తీయించారు. ఘటన రోజు ఏం జరిగిందో మొత్తం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
* నవంబర్ 27వ తేదీన దిశను నిందితులు అత్యాచారం చేసి కాల్చి చంపారు.
* ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.
* ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దిశ హంతకులను కఠినంగా శిక్షించాలంటూ తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు.
* కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది.
* ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* ఈ కేసులో సత్వర విచారణ చేపట్టి నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష పడుతుందని భావించారు.
నిందితులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ రోజు రోజుకు పెరిగింది. అంతే కాకుండా శిక్షలను తక్షణమే ఖరారు చేసి అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో నిందితుల తరఫున ఏ లాయర్ కూడా వాదించకూడదని బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. షాద్ నగర్ పీఎస్ వద్ద నిందితులను విచారిస్తున్న క్రమంలో భారీగా ప్రజలు తరలివచ్చిన సంగతి తెలిసిందే. తమకు అప్పచెప్పాలని లేనిపక్షంలో బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నేరం చేస్తే..చంపేయాలని నిందితుల తల్లిదండ్రులు వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరగడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.