ఐకియా స్టోర్‌లో అగ్నిప్రమాదం : పరుగులు తీసిన జనం

హైదరాబాద్: ఐకియా స్టోర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. మాల్‌లోని సెల్లార్ వన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పొగ రావడంతో ఉలిక్కిపడ్డ కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదని తెలుస్తోంది. పొగరావడంతో అప్రమత్తమైన ఐకియా సిబ్బంది.. మంటలను ఆర్పివేసింది. దీంతో ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. సండే కావడంతో భారీగా కస్టమర్లు మాల్‌కు వచ్చారు. అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసింది.
పొగరావడాన్ని గుర్తించిన సిబ్బంది ఫైర్ అలారమ్ మోగించడంతో లోపల ఉన్న కస్టమర్లు ఆందోళన చెందారు. వెంటనే వారంతా బయటకు పరుగులు తీశారు. ఐకియా స్టాఫ్ కూడా బయటకు వచ్చేశారు. అసలేం జరిగిందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఎలాంటి దుర్ఘటన జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏంటి? పొగ ఎలా వ్యాపించింది? అనే దానిపై దర్యాఫ్తు చేపట్టారు.