హైదరాబాద్ హోటల్‌లో ఫుడ్ పాయిజన్ : రెండేళ్ల బాలుడు మృతి, తల్లిదండ్రులకు అస్వస్థత
హైదరాబాద్ బేగంపేట్ మానస సరోవర్ హోటల్‌లో ఫుడ్ పాయిజన్‌తో బాలుడు చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి.

హైదరాబాద్ బేగంపేట్ మానస సరోవర్ హోటల్‌లో ఫుడ్ పాయిజన్‌తో బాలుడు చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి.
హైదరాబాద్ బేగంపేట్ మానస సరోవర్ హోటల్‌లో బాలుడు ఫుడ్ పాయిజన్‌తో చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి. విషాహారం తినడంతో రెండేళ్ల బాబు చనిపోగా… అతడి తల్లిదండ్రులు, అన్నయ్య అనారోగ్యానికి గురైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న రవి నారాయణ్ అమెరికా వెళ్లేందుకు వీసా స్టాంపింగ్ కోసం వచ్చి మానస సరోవర్ హోటల్‌లో బస చేశాడు.
ముగ్గురు కుటుంబ సభ్యులకు చికిత్స
సోమవారం స్టాంపింగ్ పూర్తయ్యాక రవి నారాయణ్ కుటుంబం హోటల్‌కు చేరుకుని… డిన్నర్ ఆర్డర్ చేసింది. హోటల్ సిబ్బంది సర్వ్ చేసిన రోటీ, పన్నీర్ తిని పడుకున్నాక అర్ధరాత్రి నలుగురికి వాంతులైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న ఉదయం రవినారాయణ్ మామయ్య హోటల్‌కు వచ్చేసరికి… నలుగురు నీరసంగా ఉండటంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండేళ్ల బాలుడు విహాన్ చనిపోగా… మిగతా ముగ్గురు కుటుంబ సభ్యులకు చికిత్స అందిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు.
పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాకపోవడంపై అనుమానాలు
మరోవైపు బాలుడి మృతిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. హోటల్‌లో చాలామంది భోజనం చేయగా… నలుగురికి మాత్రమే ఎందుకు ఫుడ్ పాయిజన్ అయిందన్న సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే బంధువులు మాత్రం విషాహారం తినడం వల్లే బాబు చనిపోయాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.