లెక్క తేలింది : నయీమ్ ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు

గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ ఎంతో గుర్తించింది సిట్. రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని వెల్లడించింది. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. వేయి 15 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలున్నాయని, మొత్తం 29 భవనాలు ఉన్నాయని వెల్లడించారు. 1.90 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 2.8 కోట్ల నగదున్నాయని తెలిపారు. 258 సెల్ ఫోన్లు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలున్నాయని, మారణాయుధాలున్నాయని సిట్ అధికారులు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్దనున్న మిలినియం టౌన్ షిప్‌లో తలదాచుకున్న నయీమ్ పోలీసుల ఎన్ కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. 2016 ఆగస్టు 08వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. సిట్ ఈ కేసును దర్యాప్తు చేపడుతోంది. తాజాగా కేసు ఐటీ శాఖకు చేరింది. నయీమ్ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. బినామీల పేరిట ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్లు గుర్తించారు.
ఈ కేసులో అరెస్టయి..బెయిల్‌పై బయటకు వచ్చిన నయీమ్ భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్తులను ఎలా కూడబెట్టారు ? తదితర వివరాలను ప్రశ్నిస్తున్నారు. కానీ టైలరింగ్, బట్టల వ్యాపారం ద్వారా ఆస్తులు సంపాదించడం జరిగిందన్న వ్యాఖ్యలను ఐటీ అధికారులు నమ్మడం లేదని తెలుస్తోంది. వేల కోట్ల రూపాయలు కూడబెట్టిన నయీమ్ ఐటీ చెల్లింపులు చేశారా ? లేదా ? అనేదానిని ఆరా తీస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కేసులో సిట్ అధికారులు, ఐటీ అధికారులు ఏం తేలుస్తారు ? ఎలాంటి చర్యలు తీసుకొంటారో రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.
Read More : ఐటీ శాఖకు నయీం కేసు..హసీనాను విచారించిన అధికారులు