అమ్మాయి పువ్వు కోసిందని 40 దళిత కుటుంబాలను వెలివేశారు

అమ్మాయి పువ్వు కోసిందని 40 దళిత కుటుంబాలను వెలివేశారు. ఈ ఘటన ఒడిశాలోని ధెంకనాల్ జిల్లాలోని కాంటియో కటేని గ్రామంలో జరిగింది. గత రెండు వారాల నుంచి వారిని సామాజిక బహిష్కరణ చేశారు. దళిత కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలిక రెండు నెలల క్రితం ఉన్నత కుల కుటుంబంలో పెరడు నుంచి పువ్వులు కోసింది. అదే తప్పు అయింది.. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
దళిత కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో ఉన్నత కులం పెద్దలు 40 దళిత కుటుంబాలను వారిని ఊరి నుంచి వెలివేశారు.. వెంటనే క్షమాపణలు చెప్పామని బాలిక తండ్రి నిరంజన్ నాయక్ డిమాండ్ చేశారు. తమతో మాట్లాడటానికి ఎవరికీ అనుమతి లేదని చెప్పారు. గ్రామంలో జరిగే ఏ సామాజిక కార్యక్రమంలోనైనా పాల్గొనడానికి అనుమతి లేదన్నారు. దాదాపు 800 కుటుంబాలను కలిగి ఉన్న ఈ గ్రామంలో షెడ్యూల్డ్ కుల నాయక్ వర్గానికి చెందిన 40 కుటుంబాలు ఉన్నాయి.
బాధిత కుటుంబాలు ఆగస్టు 17 న జిల్లా యంత్రాంగానికి, సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు మెమోరాండం సమర్పించాయి. పిడిఎస్ డీలర్, ప్రొవిజన్ స్టోర్ యజమాని సరుకులు అమ్మడం మానేశారని ఆరోపించారు. అవసరమైన వస్తువులను కొనడానికి కనీసం 5 కిలోమీటర్లు పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గ్రామస్తులు మాతో మాట్లాడటం కూడా మానేశారని గ్రామస్తులలో ఒకరైన జ్యోతి నాయక్ అన్నారు.
గ్రామ రహదారిపై వివాహాలు లేదా అంత్యక్రియలకు ఎలాంటి ఊరేగింపులు నిర్వహించొద్దని హెచ్చరించారని సంఘం సభ్యులు ఆరోపించారు. గ్రామాల్లోని సభ్యులతో మాట్లాడవద్దని గ్రామస్తులను కోరినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. మెమోరాండం సమర్పించిన తరువాత ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. అయినా ఫలితం లేకపోయింది. పోలీసులు మరోసారి ఇరువర్గాలతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.