అసలేం జరిగింది : నులిపురుగు నివారణ మాత్ర వేసుకున్న చిన్నారి మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురిలో విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో నులిపురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఇది వేసుకున్న కాసేపటికే.. ఫిట్స్ వచ్చి ఓ చిన్నారి

జగిత్యాల జిల్లా ధర్మపురిలో విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో నులిపురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఇది వేసుకున్న కాసేపటికే.. ఫిట్స్ వచ్చి ఓ చిన్నారి
జగిత్యాల జిల్లా ధర్మపురిలో విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో నులిపురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఇది వేసుకున్న కాసేపటికే.. ఫిట్స్ వచ్చి ఓ చిన్నారి చనిపోయింది. సోమవారం(ఫిబ్రవరి 10,2020) ఉదయం ధర్మపురిలో పిల్లలకు నులిపురుగు నివారణ టాబ్లెట్లు వేశారు. ధర్మపురిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న సహస్ర అనే ఏడేళ్ల పాపకు ఆశా వర్కర్ ఈ టాబ్లెట్ ఇచ్చింది. అది వేసుకున్న కాసేపటికే పాపకు వాంతులు అయ్యాయి. ఆ తర్వాత ఫిట్స్ రావడంతో ధర్మపురిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో జగిత్యాల తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు.
అక్కడికి వెళ్లేసరికే పాప చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. తమ బిడ్డ ప్రాణాలు తీశారని సహస్ర తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఉదయం వరకు బాగానే ఉన్న చిన్నారి.. ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించిందని, నులిపురుగు మాత్రలు వికటించాయని తల్లిదండ్రులు ఆరోపించారు.
సహస్ర మృతి కలకలం రేపుతోంది. దీనిపై అధికారులు స్పందించారు. విచారణకు ఆదేశించారు. అయితే కారణాలు ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, రిపోర్ట్ వస్తే కానీ క్లారిటీ ఇవ్వలేమన్నారు. కడుపులో నులిపురుగుల నివారణ కోసం పిల్లలకు మాత్రలు ఇవ్వడం కామన్. అయితే కొందరు పిల్లలకు ఇవి పడవు. వాంతులు చేసుకుంటారు. కడుపులో నొప్పి వస్తుంది. అంతకు మించి ప్రమాదం లేదు. అయితే దీర్ఘకాలంగా ఫిట్స్ లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నులి పురుగు నివారణ మాత్రలు ఇవ్వకూడదు. సహస్రకు అలాంటిదేమీ లేదని చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి.. ఏం జరిగిందో తెలియాల్సి ఉంది.
నులిపురుగు నివారణ కోసం.. ఆరోగ్యంగా ఉండేందుకు.. 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలందరికి నులిపురుగు నివారణ మాత్రలు ఇస్తారు. 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు కడుపులో నులిపురుగులు తయారవడం మూలంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటి నివారణకు పిల్లలందరికీ తప్పనిసరిగా నులిపురుగు నిరోధిక మాత్రలు అల్బెండజోల్ ట్యాబ్లెట్ ఇస్తారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో వైద్య ఆరోగ్యశాఖ.. పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్ర వేస్తుంది.
ఈ మాత్ర చాలా సురక్షితమైందని, ఈ మాత్ర వలన పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగదని డాక్టర్లు చెప్పారు. ఈ మాత్రతో పిల్లలు చాలా ఆరోగ్యంగా తయారవుతారని అన్నారు. మరి సహస్ర విషయంలో ఏం జరిగింది? మృతికి కారణం ఏంటి? నులిపురుగు ట్యాబ్లెట్ వికటించడం వల్లే చనిపోయిందా? ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.
Read More>>3వ ప్రైవేట్ రైలు…కాశీ మహాఖల్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపిన మోడీ