అమానవీయ ఘటన.. కనీస మానవీయత చూపలేరా, చదువుకు దూరం చేస్తారా?

బాధితురాలికి బాసటగా నిలవాల్సిన సమాజం చేయూత అందించకపోవడంతో ఆమె భవిష్యత్తు అంధకారంలో పడింది. ఆ అభాగ్యురాలు న్యాయం చేయమని అధికారులను ఆశ్రయించింది.

అమానవీయ ఘటన.. కనీస మానవీయత చూపలేరా, చదువుకు దూరం చేస్తారా?

Representative Image

Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సామూహిక లైంగిక దాడి బాధితురాలిని పరీక్ష రాయకుండా అడ్డుకున్న దారుణ ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా చేసింది. బాధితురాలికి బాసటగా నిలవాల్సిన సమాజం చేయూత అందించకపోవడంతో ఆమె భవిష్యత్తు అంధకారంలో పడింది. తాను చదివిన విద్యా సంస్థే పరీక్షలు రాయకుండా అడ్డుకోవడంతో ఆ అభాగ్యురాలు న్యాయం చేయమని అధికారులను ఆశ్రయించింది.

అసలేం జరిగింది?
అజ్మీర్‌లోని ఒక ప్రైవేటు విద్యా సంస్థలో 12వ తరగతి చదువుతున్న బాలిక గతేడాది అక్టోబరులో దగ్గరి బంధువుల చేతిలో సామూహిక లైంగిక దాడికి గురైంది. దీంతో ఆమెను క్లాసులకు రావొద్దని విద్యాసంస్థ యాజమాన్యం హుకుం జారీ చేసింది. కాలేజీకి వస్తే అక్కడి వాతావరణం పాడవుతుందని, ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాలని చెప్పడంతో ఆమె సరేనంది. దాదాపు నాలుగు నెలల పాటు ఇంటిదగ్గరే ఉండి పరీక్షలకు ప్రిపేరయింది. అడ్మిట్ కార్డు తీసుకునేందుకు వెళితే ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యం తిరస్కరించింది. నువ్వు అసలు మా స్టూడెంట్‌వే కాదంటూ చీదరించుకున్నారు. ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే తనను కాలేజీకి రాకుండా చేసేందుకు ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాలని చెప్పినట్టు ఆమె గ్రహించింది. ఈలోపు పరీక్షలు అయిపోయాయి.

సీడబ్ల్యూసీకి ఫిర్యాదు
మరో కాలేజీలోని టీచర్ సహాయంతో చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (CWC)ని ఆశ్రయించింది. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీడబ్ల్యూసీ దర్యాప్తు చేపట్టింది. మొత్తం సంఘటన గురించి బాధితురాలితో మాట్లాడినట్టు సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ అంజలి శర్మ తెలిపారు. బాలిక మార్చిలో రాయలేకపోయిన పరీక్షలకు హాజరయ్యేలా చూడడమే తమముందున్న ప్రాధాన్యత అని చెప్పారు. తమ విచారణ ముగిసిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: హోటల్‌ రూములో విగత జీవులుగా దంపతులు, వారి ఫ్రెండ్.. ఏం జరిగింది?

పరీక్షల కోసం కష్టపడి చదివానని, ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం రాకపోవడంతో నిరుత్సాహానికి గురైనట్టు తనతో చెప్పిందని మీడియాతో అంజలి శర్మ చెప్పారు. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆమె 79% స్కోర్ చేసిందని వెల్లడించారు. 12వ బోర్డు పరీక్షలకు హాజరైతే ఆమె బాగా రాయగలదని, కాలేజీ నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కాగా, బాధిత విద్యార్థిని పట్ల కనీస మానవీయవత చూపించని కాలేజీ యాజమాన్యం, ఇతర విద్యార్థుల తల్లిదండ్రుల తీరుపై హక్కుల కార్యకర్తలు, మానవతావాదులు మండిపడుతున్నారు.