అధిక లాభాల పేరుతో ఘరానా మోసం.. కోట్ల రూపాయలతో ఎండీ పరార్

పెట్టుబడి సొమ్ములో 2శాతం లాభాలు వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. రెండు నెలల పాటు లాభాలు కూడా చెల్లించాడు.

అధిక లాభాల పేరుతో ఘరానా మోసం.. కోట్ల రూపాయలతో ఎండీ పరార్

Gold Trading Investment Fraud : హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం జరిగింది. అధిక లాభాలు ఆశ చూపి ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేశ్ మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు 500మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. హబ్సిగూడలో ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి దగ్గర 5లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. 5 నెలల్లో పెట్టుబడి రెట్టింపు చేసి చెల్లిస్తామని రాజేశ్ చెప్పాడు.

పెట్టుబడి సొమ్ములో 2శాతం లాభాలు వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. 2 నెలల పాటు లాభాలు కూడా చెల్లించాడు. భారీగా పెట్టుబడులు రావడంతో ఆ డబ్బుతో రాజేశ్ పరారయ్యాడు. 2 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న రాజేశ్ ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు హైదరాబాద్ సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు.

అధిక లాభాల పేరుతో మోసం చేసే ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయని, ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ పడితే ఉన్నది కూడా పొగొట్టుకుంటారని హెచ్చరించారు. మోసపోయే వాళ్లు ఉన్నంత వరకు మోసాలు జరుగుతూనే ఉంటాయన్నారు. ముందు 2, 3 నెలలు లాభాలు చెల్లిస్తారని, ఆ తర్వాత భారీగా డబ్బు జమయ్యాక ఆ డబ్బుతో పారిపోతారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తులు, ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లాభాలకు కక్కుర్తి పడితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ కూడా అలాంటి తరహా మోసమే అని చెప్పారు పోలీసులు. పెట్టుబడులు పెడిటే భారీగా లాభాలు వస్తాయని ఊరించారని, చెప్పినట్లుగానే 2, 3 నెలలు లాభాలు ఇచ్చారని, ఇలా నమ్మకం ఏర్పరచుకుని పెద్ద సంఖ్యలో జనాలు పెట్టుబడులు పెట్టడంతో.. ఆ డబ్బుతో ఎండీ రాజేశ్ పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు. లాభాల సంగతి దేవుడెరుగు.. కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పొగొట్టుకుని వీధిన పడాల్సి వస్తుందన్నారు.

Also Read : డీఎస్పీ కొంపముంచిన వివాహేతర సంబంధం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసు శాఖ