Robbery Gang: వామ్మో.. పగలు కొత్తిమీర, కరేపాకు అమ్ముతూ రాత్రిళ్లు చోరీలు.. గుడివాడలో ఘరానా దొంగల ముఠా అరెస్ట్
ముఠా సభ్యులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Robbery Gang: కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు ఘరానా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల గురించి షాకింగ్ విషయాలు తెలిపారు పోలీసులు. ఈ ముఠా సభ్యులు పగలు కొత్తిమీర, కరేపాకు అమ్ముతూ తిరుగుతారు. ఊరంతా తిరుగుతారు. అన్ని ఇళ్లను గమనిస్తారు. తాళాలు వేసిన ఇళ్లను గుర్తు పెట్టుకుంటారు. ఇక రాత్రి కాగానే ముఠా సభ్యులు చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ మీడియాకు తెలిపారు.
”పమిడిముక్కల, కూచిపూడి పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో ముఠా సభ్యులను పట్టుకున్నాం. వారి వద్ద నుంచి 3 లక్షలు విలువైన 26 గ్రాములు బంగారం, 562 గ్రాముల వెండి, 3500 నగదు, 2 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాం. ముఠా సభ్యులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ఒకరు మైనర్. పగలు కొత్తిమీర, కరివేపాకు అమ్ముతున్నట్లు తిరుగుతారు. తాళాలు వేసిన ఇళ్లను గుర్తిస్తారు. రాత్రిళ్ళు వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం” అని డీఎస్పీ వెల్లడించారు.