Fake Currency : దొంగనోట్ల ముఠాను పట్టిచ్చిన చికెన్ పకోడీ

యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు ముద్రిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

Fake Currency : దొంగనోట్ల ముఠాను పట్టిచ్చిన చికెన్ పకోడీ

Fake Notes Tayari

Updated On : September 28, 2021 / 1:27 PM IST

Fake Currency : యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు ముద్రిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్ బాషా పాల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తూ ఉండేవాడు.

ఈనెల 25న పనిమీద కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి వెళ్లాడు. అక్కడ ఒక షాపులో చికెన్ పకోడి కొనుక్కుని తిందామనుకున్నాడు. లోకల్ గా ఉన్న నాన్ వెజ్ షాప్ కు వెళ్లి చికెన్ పకోడీ తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న వంద రూపాయలు  నోటు ఇచ్చాడు. అది చూసిన షాపు యజమాని నకిలీదని  గుర్తుపట్టి ఆ నోటు వద్దని ఇంకో నోటు ఇవ్వమని కోరాడు.

నాదగ్గర అదే ఉందని…. ఇంకోకటి లేదని చెప్పాడు. ఈ క్రమంలో అక్కడే ఉండి వీరి మాటలు విన్న కానిస్టేబుల్ నూర్ బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని దగ్గర ఇంకో మూడు వేల రూపాయల దొంగ నోట్లు దొరికాయి. దీంతో అతడిని జొన్నగిరి పోలీసు స్టేషన్ లో అప్పగించాడు.  పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా దొంగనోట్ల తయారీ విషయం బయటపడింది.
Also Read : Indian Idol Contestant Arrested : ఆటగాడు…పాటగాడు….కేటుగాడు…. గోల్డ్ మెడల్ విజేత అరెస్ట్
యూ ట్యూబ్ ద్వారా నోట్ల తయారీ విధానం నేర్చుకుని మరో ఇద్దరితో కలిసి దొంగనోట్లు తయారు చేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. గుంతకల్లు, మద్దికెర, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో నోట్లు మార్పిడి చేసినట్లు వివరించాడు.  రూ. 50వేల అసలైన నోట్లు తీసుకుని లక్ష రూపాయల నకిలీ నోట్లను అందచేయటంతో పాటు తాము కూడా స్వయంగా వాటిని మార్కెట్ లో పంపిణీ చేసినట్లు తెలిపాడు.

పోలీసులు నూర్ బాషాను వెంటబెట్టుకుని కసాపురానికి వెళ్లి అతని ఇంట్లో దొంగనోట్ల తయారీకి సంబంధించిన స్కానర్, జిరాక్స్ మిషన్, నోట్ల తయారీలో ఉపయోగించే పేపర్ ను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకీ సహకరించిన ఖాజా,ఎస్.ఖాసీంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.