హాజీపూర్ హరర్ స్టోరీ : శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలు

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 01:10 AM IST
హాజీపూర్ హరర్ స్టోరీ : శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలు

Updated On : May 1, 2019 / 1:10 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాలోని హజీపూర్‌ వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. శ్రావణి, మనీషా, కల్పనను హత్యచేసింది మర్రి శ్రీనివాస్‌రెడ్డేనని పోలీసులు తేల్చారు. ముగ్గురు బాలికలపైనా అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. విపరీతమైన ఉన్మాద ప్రవర్తనతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. మొత్తం నాలుగు హత్య కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డి నిందితుడి ఉన్నట్టు సీపీ చెప్పారు. లిఫ్ట్‌ ఇస్తానంటూ బాలికలను నమ్మించి ఈ దురాగతనానికి పాల్పడినట్టు వివరించారు.

ఏప్రిల్‌ 25న శ్రావణి అనే బాలిక అదృశ్యమైనట్టు తండ్రి ఫిర్యాదు చేశారని.. ఆ కంప్లైంట్‌పై బాలిక ఆచూకీ కోసం 27న సిట్‌ ఏర్పాటు చేసినట్టు కమిషనర్‌ తెలిపారు. షీటీమ్స్‌, పోలీసులు, ఐటీ సెల్‌ దర్యాప్తు చేశాయన్నారు. చివరికి మర్రి శ్రీనివాస్‌రెడ్డి బావిలోనే శ్రావణి మృతదేహాన్ని గుర్తించామన్నారు. గ్రామస్తులు చెప్పిన వివరాల మేరకు అతడిపై అనుమానం వచ్చిందని… ఏప్రిల్‌ 26న నుంచి అతడు పరారీలో ఉన్నాడన్నారు. దీంతో శ్రావణిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు ప్రాథమికంగా గుర్తించి… రావిర్యాల గ్రామంలోని బంధువుల ఇంట్లో నిందితుడు ఉన్నట్టు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అతడి నేరాలన్నీ బయటపడ్డాయన్నారు. 

శ్రావణి, మనీషా, కల్పన ముగ్గురిని హత్య చేసింది శ్రీనివాస్‌రెడ్డేనని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.  బాలికలకు లిఫ్ట్‌ ఇచ్చి వారిని బావి దగ్గరకు తీసుకెళ్లి వారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలిపారు. ఏప్రిల్‌ 25న శ్రావణి స్కూల్‌లో స్పెషల్‌ క్లాసులు ముగించుకుని బస్సు కోసం ఎదురుచూస్తుండగా శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్‌ ఇచ్చాడు. ఆమెను తన బావి దగ్గరకు తీసుకెళ్లి బావిలోకి నెట్టేశాడు. గాయాలతో ఉన్నప్పుడే ఆమెపై హత్యాచారం జరిపాడు. ఇక మహాశివరాత్రి రోజున అదృశ్యమైన మనీషాను శ్రీనివాస్‌రెడ్డే హత్య చేశాడు. ఆమెకూ లిఫ్ట్‌ ఇచ్చి బావి దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్టు  సీపీ తెలిపారు.

2015లో అదృశ్యమైన కల్పనను కూడా తానే హత్యచేసినట్టు పోలీసుల విచారణలో శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో చిన్నారి కల్పన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. కల్పనను హత్యచేసి బాడీని సంచిలో ప్యాక్‌ చేసి సీతారాంరెడ్డి బావిలో పడేసినట్టు నిందితులు పోలీసులకు తెలిపాడు. ఆ మృతదేహం కోసం అక్కడ వెతకగా… ఎముకలు లభించాయి. చిన్నారి టిఫిన్‌ బాక్స్‌, స్కూల్‌ డ్రెస్‌ కనిపించింది. బాలిక తల్లిదండ్రులు వాటిని గుర్తుపట్టి కల్పన హత్యగావించబడినట్టు తేల్చారు. తప్పిపోయిందనుకున్న తమ కూతురు హత్యకు గురైందని తెలియడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతురు ఏదో ఒకరోజు తిరిగి వస్తుందని భావించామని… కానీ కానరాని లోకాలకు పోయిందంటూ రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.

శ్రీనివాస్‌రెడ్డి చేసిన అకృత్యాలు ఇంతటితో ఆగలేదు. కర్నూలులో ఓ మహిళపై అత్యాచారం , హత్యకు నిందితుడు ఒడిగట్టినట్టు తెలిసింది. అలాగే వరంగల్‌లోని ఓ మహిళపైనా అత్యాచారం చేశాడు. బెంగళూరులోని ఓ ఏటీఎంలో బ్యాగ్‌ లాక్కుంటూ మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ మహిళపై దాడి చేసింది కూడా శ్రీనివాస్‌రెడ్డేనని పోలీసుల విచారణలో వెల్లడైంది.

నిందితుడిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు బాలికలను హత్యచేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించడంతో హజీపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై గ్రామస్తులు దాడి చేశారు. ఆపై నిప్పంటించారు. దీంతో ఇంటిముందున్న పందిరి కాలిపోయింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. మరోవైపు కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ హజీపూర్‌ను సందర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ నిచ్చారు.