పక్కంటి అబ్బాయితో మాట్లాడిందని : కూతురికి కరెంట్ షాకిచ్చి.. కత్తితో గొంతు కోసి!

  • Published By: sreehari ,Published On : November 18, 2019 / 07:43 AM IST
పక్కంటి అబ్బాయితో మాట్లాడిందని : కూతురికి కరెంట్ షాకిచ్చి.. కత్తితో గొంతు కోసి!

Updated On : November 18, 2019 / 7:43 AM IST

షాకింగ్ న్యూస్. ఇదో పరువు హత్య. ఒక తండ్రి తన కుమార్తెను కిరాతకంగా హత్యచేశాడు. కూతురికి కరెంట్ షాకిచ్చి.. ఆపై గొంతు కోసి చంపేశాడు. తన కుమార్తె పక్కంటి అబ్బాయితో ప్రేమలో పడిందనే కారణంతో ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 22ఏళ్ల కుమార్తెను తండ్రి హత్యచేసిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫెరోజాబాద్ జిల్లాలో సాలేంపూర్ ఖుటియానా గ్రామంలో కలకలం రేపింది. 

పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో గత 18 నెలల్లో జరిగిన పరువు హత్యల్లో ఇది 23వ కేసుగా పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. హరివాన్ష్ కుమార్ అనే వ్యక్తి, తన కుమార్తె పూజతో కలిసి ఖుటియానా గ్రామంలో ఉంటున్నాడు. మిగితా కుటుంబమంతా గుర్గావ్‌లో నివసిస్తోంది.

తన తండ్రితో ఒంటరిగా ఉంటున్న పూజ పక్కంటి అబ్బాయితో ప్రేమలో పడింది. ఓ రోజు అర్ధరాత్రి సమయంలో పూజ.. ఇంటి పక్కన ఉండే గజేంద్ర అనే అబ్బాయితో మాట్లాడుతూ కనిపించింది. అంతే.. తండ్రి హరివాన్ష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన పరువు తీస్తోందనే కోపంతో వెంటనే కూతుర్ని ఇంట్లోకి లాక్కొచ్చాడు. కరెంట్ షాకిచ్చాడు. 

ఆ తర్వాత కత్తితో ఆమె గొంతు కోసి చంపేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గిరీష్ చంద్ర గౌతమ్ తెలిపారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఘటన స్థలంలో కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు SHO తెలిపారు.

బాధితురాలు పూజ పీజీ చదివింది. తనకు నలుగురు సోదరులు ఉండగా ఆమె ఒక్కరే కుమార్తె. సోదరుడు యోగేశ్ తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసుల తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.