బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో దర్శన్, పవిత్ర గౌడ ఎలా ఉన్నారంటే..?

మహిళా బ్యారక్‌లో ఉన్న నటి పవిత్రా గౌడ ఇతర ఖైదీలతో కలవకుండా ఒంటరిగానే ఉంటోంది. చాలాసార్లు గట్టిగా ఏడుస్తోందని కారాగార సిబ్బంది చెబుతున్నారు.

Darshan – Pavithra Gowda: చిత్రదుర్గకు చెందిన యూ ట్యూబర్‌, అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్యాప్తును కర్ణాటక పోలీసులు ముమ్మరం చేశారు. నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్రగౌడతో పాటు ఇతర నిందితులకు 13 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీని విధించింది న్యాయస్థానం. జులై 4 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ ఉండటంతో వీరందరినీ బెంగళూరు పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. నటుడు దర్శన్‌కు పరప్పణ అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. ఇతర ఖైదీల బ్యారక్‌లో ఉంచితే, వారి నుంచి సమస్యలు వస్తాయని ప్రత్యేక బ్యారక్‌ను దర్శన్, మరో నటుడు ప్రదోశ్‌కు కేటాయించారు.

బరువు తగ్గిన దర్శన్
విచారణ ఖైదీగా ఉన్న అతనికి 6106 నంబరును కేటాయించారు. రాత్రి భోజనానికి రాగి సంగటి, అన్నం, సాంబారు మజ్జిగ, ఆకుకూర పులుసు ఇచ్చారు. రాత్రి అరకొరగా అన్నం తిని, ఆలస్యంగా నిద్రపోయాడు దర్శన్‌. ఉదయం ఆరున్నర గంటలకు నిద్రలేచి తాగడానికి వేడి నీరు కావాలని కోరాడు. కొంత సమయం బ్యారక్‌ ఆవరణలోనే నడిచాడు. స్నానం చేశాక.. అల్పాహారంగా రైస్‌ బాత్‌ ఇచ్చారు. హత్య కేసులో దర్శన్‌ అరెస్టయి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ఆయన బరువు కొంత తగ్గాడు. రక్తపోటు కంట్రోల్‌లో లేదని వైద్యులు చెప్పారు.

పవిత్ర గౌడ ఏడుపు
ఇక మహిళా బ్యారక్‌లో ఉన్న నటి పవిత్రా గౌడ ఇతర ఖైదీలతో కలవకుండా ఒంటరిగానే ఉంటోంది. చాలాసార్లు గట్టిగా ఏడుస్తోందని కారాగార సిబ్బంది చెబుతున్నారు. జూన్‌ 8న రేణుకాస్వామి హత్య తర్వాత కొందరు సాక్షులను నిందితులు బెదిరించారని పోలీసులు గుర్తించారు. కొందరు నిందితులు హత్య తర్వాత రక్తం మరకలు ఉన్న తమ బట్టల్ని కాల్చేశారు. కొత్త బట్టలు కొనుక్కున్నారు. సాక్షులకు ప్రాణహాని ఉండటంతో వారి వివరాలను గోప్యంగా ఉంచామని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.

Also Read : డీఎస్పీ కొంపముంచిన వివాహేతర సంబంధం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసు శాఖ

నిందితుల ఫోన్లు జప్తు
రేణుకాస్వామి హత్య కేసులో నిందితులు 17 మంది. అందరినీ బెంగళూరులో 24వ అడిషినల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాలతో వీరంతా పరప్పణ అగ్రహార కారాగారంలోనే ఉన్నారు. ఇప్పటి వరకు అన్నపూర్ణేశ్వరి నగర ఠాణా వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు తొలగించారు. దర్శన్‌తో పాటు ఇతర నిందితుల ఫోన్లను జప్తు చేశారు. అందులో డేటాను మొత్తం తొలగించి ఉండటాన్ని గుర్తించి, వివరాలు రాబట్టేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. రేణుకాస్వామి ఫోన్‌ను హత్య తర్వాత రాజకాలువలో పడేశారు. సిమ్‌కార్డు సర్వీసు ప్రొవైడర్‌ సహకారంతో అతని కాల్‌డేటాను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. దర్శన్‌ ఇంట్లో లభించిన నగదు వివరాలను ఆదాయ పన్నుశాఖ అధికారులకు అందించారు. తదుపరి విచారణలో వాటి వివరాలను రాబట్టేందుకు ప్రత్నిస్తామని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు