Blast In Pakistan : పాకిస్తాన్ లో భారీ పేలుడు.. నలుగురు మృతి
దేశం నుంచి అన్ని రకాల ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజులకే ఈ పేలుడు సంభవించడం శోచనీయం.

Blast In Pakistan
Blast In Pakistan : పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. సోమవారం క్వెట్టా నగరంలోని మార్కెట్ దగ్గర నిలిపి ఉంచిన పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాందహరి బజార్ లో పార్క్ చేసిన యాక్టింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారి వాహనాన్ని టార్గెట్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి షఫ్కత్ చీమా రాయిటర్స్ పేర్కొన్నారు.
ఆ అధికారి వాహనం వెనుక పార్క్ చేసిన మోటార్ బైక్ కు పేలుడు పదర్ధాలు అమర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారని, మరికొంతమందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం సివిల్ ఆస్పత్రికి తరలించారని, ఎనిమిది మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చించినట్లు క్వెట్టా ఆస్పత్రి ప్రతినిధి వాసిమ్ బేగ్ పేర్కొన్నారు.
కాగా, సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని పోలీసు అధికారి పేర్కొన్నారు. అయితే దేశం నుంచి అన్ని రకాల ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజులకే ఈ పేలుడు సంభవించడం శోచనీయం.