Hyderabad Married Woman : భర్త చేసిన పనికి.. వివాహిత దారుణ నిర్ణయం.. పిల్లలను చంపి ఆపై తాను కూడా
Hyderabad Married Woman : భర్త ఆగడాలు భరించలేకపోయిన ఓ మహిళ.. తల్లి ప్రేమను చంపుకుని.. బిడ్డలకు ఉరేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.
hyderabad kukatpally married woman kills two sons and after ends her life
- హైదరాబాద్, కూకట్‌పల్లిలో విషాదం
- పిల్లలకు ఉరేసి.. తాను కూడా ఆత్మహత్య
- భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో భరించలేక
Hyderabad Married Woman : వారికి వివాహమై 13 ఏళ్లు. ఇద్దరు కుమారులున్నారు. భర్త కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. వచ్చిన జీతం డబ్బులతో పాటు అప్పులు చేసి మరీ ఎంజాయ్ చేసేవాడు. భార్యాబిడ్డలను పట్టించుకునేవాడు కాదు. దీనికి తోడు రెండేళ్ల క్రితం మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. భర్త తాగినా, తిరిగినా.. ఎన్ని వేషాలు వేసినా.. ఓపికతో భరించిన ఆమె.. చివరకు అతడు తనకు నమ్మకద్రోహం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. భర్త చేసిన పనికి మనస్తాపానికి గురై ఇద్దరు కుమారులకు ఉరి వేసి.. ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్, చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన బానోజు ప్రవీణ్‌కుమార్‌కు.. చంద్రపేట తండాకు చెందిన స్రవంతితో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కార్తీక్ (10), కౌశిక్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ఈ దంపతులు.. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. దంపతులు కూకట్పల్లి పరిధిలోని కైత్లాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రవీణ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్నాళ్లపాటు వీరి కాపురం బాగానే సాగింది.
రెండేళ్ల క్రితం రెండో పెళ్లి
అయితే రెండేళ్ల క్రితం ప్రవీణ్.. మరో వివాహం చేసుకున్నాడు. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహేశ్వరి (సోనీ) అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్రవంతి దీని గురించి భర్తను నిలదీసింది. నాటి నుంచి దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. కొన్నాళ్ల తర్వాత సోనీ.. ప్రవీణ్‌ను వదిలి వెళ్లిపోయింది. దీంతో ప్రవీణ్.. మొదటి భార్య స్రవంతి వద్దే ఉంటున్నాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ దంపతుల మధ్య గొడవలు మరింత పెద్దవయ్యాయి. ప్రవీణ్ తీరుతో విసిగిపోయిన స్రవంతి.. నాలుగు రోజుల క్రితం తన కుమారులిద్దరిని తీసుకుని హైదరాబాద్ నుంచి పుట్టింటికి వెళ్లింది. భర్తతో జరుగుతున్న గొడవల గురించి తన తల్లిదండ్రులకి చెప్పింది. ఈ క్రమంలో స్రవంతి తల్లిదండ్రులు.. గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ప్రవీణ్‌ను పిలిచి మందలించారు. ఆ తర్వాత ప్రవీణ్ తన భార్య, కుమారులను తీసుకుని సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చాడు. మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ ప్రారంభమైంది.
ఆ తర్వాత ప్రవీణ్.. తన డ్రైవర్ ఉద్యోగానికి వెళ్లి.. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ అప్పటికే స్రవంతి.. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అయితే రెండు రోజుల క్రితం ప్రవీణ్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని స్రవంతి తన సోదరుడికి పంపిన వీడియోను ఆమె ఫోన్లో చూసిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్రవంతి పిల్లలకు ఉరేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు.. బోడ మాణిక్యం తండాకు చేరుకుని ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు.
